పరారీలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ?
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ.. ఉద్యోగుల సమస్యలు తీర్చాలంటూ ఆయన పలు మార్లు ప్రభుత్వాన్ని కోరారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Jun 2023 7:07 AM GMTపరారీలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ?
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ.. ఉద్యోగుల సమస్యలు తీర్చాలంటూ ఆయన పలు మార్లు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ తీరుపై ఏకంగా గవర్నర్ ను కలిసిన ఆయనపై ఇప్పుడు అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆయనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. వాణిజ్య పన్నుల శాఖలో అక్రమాలపై కేసులు నమోదు కావడంతో పోలీసులకు దొరకకుండా సూర్యనారాయణ పరారీలో ఉన్నారని అంటున్నారు. ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
వాణిజ్యపన్నుల శాఖలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి సూర్యనారాయణ కొందరితో కలిసి మోసాలకు పాల్పడ్డారని పోలీసులు ఆరోపిస్తున్నారు. వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులపై నమోదైన కేసులో సూర్యనారాయణను ఏ5గా చేర్చారు. ఐపీసీ 167,409, 477ఏ, 201,420, 384, 120బి ప్రకారం మే 30వ తేదీన పటమట పోలీసులు కేసులు నమోదు చేశారు. తాజాగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం కూడా సూర్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో గత నెల 31వ తేదీన నలుగురు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా వారిపై అవినీతి నిరోధక సెక్షన్లను కూడా చేర్చారు. వాణిజ్య పన్నుల శాఖలో కొందరు ఉద్యోగులు వ్యాపారులకు నోటీసులు ఇచ్చి వాటి ద్వారా భారీగా లంచాలు తీసుకున్నట్లు అధికారుల ఆడిట్లలో గుర్తించారని అంటున్నారు. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన మొహర్ కుమార్, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మధ్య 954ఫోన్ కాల్స్ నడిచినట్లు దర్యాప్తులో గుర్తించారు. వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన అక్రమాలకు ఇద్దరు కలిసి కుట్రపన్నారని ప్రభుత్వ అదనపు పీపీ దుష్యంత్ రెడ్డి ఆరోపించారు.
పోలీసులు పెట్టిన కేసులు కొట్టేయాలంటూ ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్య నారాయణ హైకోర్టులో పిటిషన్ వేశారు. పోలీసుల తరపున వాదనలు వినిపించడానికి పిపి రాకపోవడంతో విచారణ వాయిదా వేయాలని న్యాయవాది కోరడంతో జస్టిస్ శ్రీనివాసరెడ్డి అంగీకరించారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు చెల్లించడంలో జాప్యాన్ని నిరసిస్తూ గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతోనే షోకాజ్‌లు ఇచ్చి వేధింపులకు పాల్పడుతుందని, కేసులు పెట్టి వేధిస్తున్నారని సూర్యానారాయణ తరఫున న్యాయవాది వాదించారు.