వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసుల పూర్తి వివరాలు రెండు వారాల్లోగా అందించాలని పేర్కొంది. కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాలు అందించాలని చెప్పింది. సీబీఐ, ఈడీ కేసుల వివరాలు విడివిడిగా చార్ట్ రూపంలో అందించాలంది. అన్ని వివరాలతో అఫిడవిట్లు రెండు వారాల్లో దాఖలు చేయాలని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం ఆదేశించింది.
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఆలస్యం అవుతోందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో పిటిషన్ వేశారు. కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అటు రోజువారీ విచారణకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆదేశించినట్టు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే విచారణకు ఎందుకు ఇంత ఆలస్యం అవుతోందని న్యాయవాదులను ధర్మాసనం ప్రశ్నించింది. పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు ఇస్తే తగిన ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం చెప్పింది. తదుపరి విచారణకు ఈ నెల 13కు వాయిదా వేసింది.