మాజీ మంత్రి వివేకా హత్యకేసు విచారణను ఏప్రిల్ 30లోపు పూర్తి చేయాలని సుప్రీం కోర్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)కి డెడ్‌లైన్ విధించింది. విస్తృత కుట్ర కోణాన్ని అత్యంత వేగంగా బయటపెట్టాలని ఆదేశించింది. వివేకా హత్య కేసుకు సంబంధించి పలు అంశాలపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో నేడు(బుధవారం) విచారణ జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక ఉత్తర్వులను న్యాయస్థానం జారీ చేసింది.
ఏప్రిల్ 30లోపు వివేకా హత్య కేసు దర్యాప్తును ముగించాలని నిర్దేశించింది. ఇప్పటికే కేసు విచారణ ఆలస్యం అవుతోందని, కాబట్టే కాలపరిమితిని విధిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు ఈ కేసులో ప్రధాన దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌ను సీబీఐ తప్పించింది. ఈ మేరకు ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేస్తూ సీబీఐ ఇచ్చిన ప్రతిపాదనకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది.
కేసు విచారణ ఆలస్యం అవుతున్నందున ఏ5 నిందితుడు శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలని ఆయన భార్య తులసమ్మ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. ఆరు నెలల్లోపు ట్రయల్ మొదలు కాకపోతే సాధారణ బెయిల్ పిటిషన్ కు అవకాశం ఉంటుందని, అప్పుడు సాధారణ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సూచించింది.