ఎమ్మెల్సీ అనంతబాబుకు డీఫాల్ట్ బెయిల్ మంజూరు

Supreme court granted bail to AP MLC Anantha babu. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్సీ అనంతబాబుకు

By అంజి  Published on  12 Dec 2022 7:34 AM GMT
ఎమ్మెల్సీ అనంతబాబుకు డీఫాల్ట్ బెయిల్ మంజూరు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ ఏడాది మే నెలాఖరు నుండి అనంతబాబు రాజమండ్రి జైల్లో ఉన్నాడు. అప్పటి నుంచి బెయిల్‌ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అనంతబాబు బెయిల్ పిటిషన్‌ను రాజమండ్రిలోని ఎస్సీ ఎస్టీ కోర్టు కొట్టేసింది. హైకోర్టులో కూడా చాలా సార్లు అనంతబాబును బెయిల్‌ తిరస్కరించబడింది. చివరకు అనంతబాబు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేడు ఈ బెయిల్ పిటీషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. బెయిల్ షరతులను కింది కోర్టు నిర్ణయించాలని స్పష్టం చేసింది.

గత విచారణలో అనంతబాబును అరెస్టు చేసి 90 రోజులు గడిచాయని ఆయన తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు. మరో వైపు పోలీసులు సరిగా దర్యాప్తు చేయడం లేదని, ఫోరెన్సిక్ నివేదికలని కారణం చెప్పి చార్జిషీట్ దాఖలు చేయడం లేదన్నారు. ఆగస్టు 26న ట్రయల్ కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా నిందితుడికి మరో 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించాలన్నారని, ఈలోగా చార్జిషీట్ దాఖలు చేస్తామని పోలీసులు చెప్పారన్నారు. కానీ ఇప్పటి వరకు చార్జిషీట్ దాఖలు చేయలేకపోయారని అన్నారు. ఈ పరిస్థితుల్లో అనంత బాబు డిఫాల్ట్ బెయిల్ పొందేందుకు అర్హుడని, ఆయనకు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు డ్రైవర్‌ సుబ్రహ్మణ్‌యం తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. బెయిల్‌ మంజూరు చేస్తే ఈ కేసులో సాక్షులను, బాధిత కుటుంబాన్ని ప్రభావితం చేసే ఛాన్స్‌ ఉందని అన్నారు. ఈ పరిస్థితుల్లో అనంతబాబుకు బెయిల్‌ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. అయితే తామేమీ అనంతబాబును నిర్దోషిగా ప్రకటించడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. 90 రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేయకపోతే డిఫాల్ట్ బెయిల్‌కు అర్హులవుతారని చెప్పింది. ఆ వాదనల ప్రకారం ఇప్పుడు డీఫాల్ట్ బెయిల్‌ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది.

Next Story