విజయవాడ: రైతుబజార్లు, సూపర్ మార్కెట్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా వంటనూనె, కందిపప్పు, ఉల్లిగడ్డలను సబ్సిడీపై అందించాలని ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జి కలెక్టర్ డాక్టర్ నిధిమీనా అధికారులను ఆదేశించారు. పీడీఎస్ షాపుల ద్వారా రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలపై 6ఏ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పౌరసరఫరాలు, రెవెన్యూ అధికారులతో జరిగిన సమావేశంలో పీడీఎస్ షాపులకు కొత్త డీలర్ల నియామకంపై ఆమె చర్చించారు.
గత మూడు నెలల్లో 54 కేసులు నమోదు చేశామని, 627 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశామని ఆమె వెల్లడించారు. 800 కార్డులు పైబడిన రేషన్ దుకాణాన్ని రెండుగా విభజించాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. అదనంగా, 82 కొత్త పీడీఎస్ దుకాణాలు ఏర్పాటు చేయబడతాయని తెలిపారు. డీలర్ నియామకాలు నవంబర్ 12 నాటికి పూర్తవుతాయన్నారు. లబ్ధిదారులు సరసమైన ధరల దుకాణాల్లో బియ్యం బదులు మూడు కిలోల వరకు ఉచిత జొన్నలను కూడా తీసుకోవచ్చని తెలిపారు.