అత్యాచారాలు, దాడులకు పాల్పడే వారిపై తక్షణమే కఠిన చర్యలు : హోం మంత్రి అనిత
రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని, అత్యాచారాలకు, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఏ మాత్రం వెనుకాడే ప్రసక్తే లేదని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు.
By Kalasani Durgapraveen Published on 15 Oct 2024 9:37 AM GMTరాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని.. అత్యాచారాలకు, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఏ మాత్రం వెనుకాడే ప్రసక్తే లేదని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్లో డి.జి.పి. ద్వారకా తిరుమలరావు, లా అండ్ ఆర్డర్ ఐ.జి. శ్రీకాంత్ తో కలసి ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం ఇస్తున్న అత్యధిక ప్రాధాన్యతను వివరించారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రాధాన్యత నిస్తూ తరచుగా డి.జి.పి., పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై ఏ మాత్రం దాడులు, అత్యాచారాలు జరిగిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. సంబందిత జిల్లాల ఎస్పీలతో నేరుగా మాట్లాడుతూ.. పోలీస్ యంత్రాగాన్ని అప్రమ్తతం చేయడమే కాకుండా నిందితులను వెంటనే పట్టుకుని శిక్షపడేలా చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 12 వ తేదీన శ్రీ సత్యసాయి జిల్లాలో అత్తా కోడళ్లపై సామూహిక అత్యాచారం జరగడం అనేది ఒక దురదృష్టకరమైన సంఘటన అని, అయితే ఈ కేసుకు సంబందించిన నిందితులను 48 గంటల్లోనే పట్టుకుని రిమాండుకు పంపడం జరిగిందన్నారు. దేవీ నవరాత్రుల సందర్బంగా విజయవాడ ఇంద్ర కీలాద్రిపై మరియు తిరుమల్లో బ్రహ్మోత్సవాల సందర్బంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసే పనుల్లో పోలీసు యంత్రాంగం అంతా నిమగ్నమై ఉన్నప్పటికీ.. అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో కొండలు, కోనలు అనకుండా 200 కి.మి. పాటు వెంటాడి ఐదుగురు నిందితులను 48 గంటల్లోనే పట్టుకోవడం జరిగిందన్నారు. వీరిలో ఒక నిందితుడు 14 వ ఏట నుండే పలు రేప్ కేసులు, దొంగతనాల్లో ప్రమేయం ఉన్న నేరచరితుడని, అతనిపై దాదాపు 37 కేసుల వరకూ నమోదు అయినట్లు ఆమె తెలిపారు. అదే విధంగా బాపట్ల జిల్లాలో ఒక మహిళపై అత్యాచారం జరిపి హత్య చేసిన కేసుకు సంబందించిన నిందితులను కూడా 42 గంటల్లో పట్టుకోవడం జరిగిందన్నారు. ఈ రెండు కేసుల విషయంలో నిందితులకు తక్షణమే కఠిన శిక్షలు పడేలా చూడాలనే ఉద్దేశ్యంతో ప్రత్యేక కోర్టుకు అప్పగించి విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించిందని,.. అందుకు తగ్గట్టుగా రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానానికి ఒక లేఖను కూడా రాయడం జరుగుతుందని ఆమె తెలిపారు.
అదే విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలను మరింత పటిష్టంగా అమలు పర్చాలనే లక్ష్యంతో రాష్ర వ్యాప్తంగా అన్ని ముఖ్యమైన కూడళ్లు, ప్రాంతాలు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు, ప్రభుత్వ, ప్రైవేటు వసతి గృహాలు, కళాశాలలు, పాఠశాలల వద్ద సి.సి. కెమేరాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రైవేటు సంస్థలు, ప్రాంగణాల్లో ఉండే సి.సి. కెమెరాలను పోలీస్ శాఖతో అనుసంధానం చేస్తే వెంటనే నిందితులను పట్టుకునే అవకాశం ఉంటుందని, అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సి.సి. కెమేరాలు లేని చోట్ల డ్రోన్ల సహకారంతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరుగుచున్నదని, డ్రోన్లు కూడా లేని చోట మొబైల్ పోన్ నే ఆయుధంగా ఉపయోగిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా పోలీస్ వారి తక్షణ సహకారానికై 112 లేదా 100 కు ఫోన్ చేయాలని ఆమె కోరారు. మహిళలు, చిన్నారులపై జరిగే అత్యాచారాలు, దాడులకు సంబందించిన ఫిర్యాదులు కూడా ఈ నెంబర్లకు చేయవచ్చని, అయితే ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని.. అవసరమైతే వారికి భద్రత కూడా కల్పించడం జరుగుతుందని తెలిపారు.