ఈ-క్రాపింగ్‌ను బలోపేతం చేయాలి : సీఎం జగన్
Strengthen e- cropping so that farmers are compensated Jagan.రైతులకు నష్టపరిహారం అందేలా ఈ-క్రాపింగ్‌ను పటిష్టం
By తోట వంశీ కుమార్ Published on 28 Jun 2022 1:14 PM ISTరైతులకు నష్టపరిహారం అందేలా ఈ-క్రాపింగ్‌ను పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
సమీక్షా సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ఖరీఫ్ ప్రారంభం అవుతుందని, రైతు పండించిన పంటను ఖచ్చితంగా ఈ-క్రాపింగ్ చేయాలన్నారు. సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, ఏ కష్టం వచ్చినా రైతును ఆదుకునేందుకు వీలుంటుందన్నారు. ఈ-క్రాప్ ప్రక్రియను మరింత బలోపేతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈ-క్రాప్ చేసిన తర్వాత డిజిటల్ రశీదుతోపాటు, ఫిజికల్ రశీదుకూడా ఇవ్వాలన్నారు. డిజిటల్ రశీదును నేరుగా రైతుల సెల్‌ఫోన్‌లకు పంపించాలన్నారు. ఒకవేళ ఏదైనా నష్టం వస్తే.. రశీదు ఆధారంగా ప్రశ్నించగలిగే హక్కు రైతులకు ఉంటుందన్నారు. దీనిపై ఎస్‌ఓపీని బలోపేతం చేయాలన్నారు.
ఈ-క్రాపింగ్ ప్రక్రియ బాధ్యతను వీఆర్వో, సర్వే అసిస్టెంట్, వ్యవసాయ సహాయకులు పంచుకోవాలన్నారు. ఆ గ్రామంలో సాగుచేస్తున్న భూములు, సంబంధిత రైతుల వివరాలతో కూడిన మాస్టర్ రిజిస్టర్‌ను వీరికి అందుబాటులో ఉంచాలి. జియో ట్యాగింగ్, ఫొటో గ్రాఫ్స్ ఈ–క్రాప్‌లో లోడ్ చేయాలన్నారు. ఆగస్టు చివరినాటి ఈ క్రాపింగ్ పూర్తి చేయాలి. సెప్టెంబరు మొదటివారంలో సామాజిక తనిఖీ చేపట్టాలి. జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచాలని సీఎం సూచించారు.
ప్రతి 15 రోజులకోసారి ఈ–క్రాపింగ్‌పై ఉన్నతాధికారుల స్థాయి అధికారులు సమీక్షిస్తారన్నారు. మండల, జిల్లా స్థాయి అధికారులు ప్రక్రియను పరిశీలిస్తారని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదని, ఆర్‌బీకేల ద్వారానే కొనుగోలు చేయాలని జగన్ అన్నారు. వరి సేకరణ, రైతులకు డబ్బులు చెల్లించే బాధ్యత పౌరసరఫరాల శాఖపైనే ఉందని సీఎం స్పష్టం చేశారు. రైతు నుంచి కొనుగోలు చేసిన తర్వాత ధాన్యాన్ని వేరే వే-బ్రిడ్జి వద్ద తూకం వేయించి రశీదును రైతుకు ఇవ్వాలన్నారు.