దేవరగట్టులో కర్రల సమరం.. 100 మందికిపైగా గాయాలు.. పలువురి పరిస్థితి విషమం

కర్నూలు జిల్లా హోళగుంద మండడలం దేవరగట్టులో దసరా ఉత్సవాల్లో భాగంగా జరిగిన బన్నీ ఉత్సవంలో 2 లక్షల మంది వరకు పాల్గొన్నట్టు తెలుస్తోంది.

By -  అంజి
Published on : 3 Oct 2025 6:39 AM IST

Stick fight, Devaragattu, Kurnool district, 100 people injured, APnews

దేవరగట్టులో కర్రల సమరం.. 100 మందికిపైగా గాయాలు.. పలువురి పరిస్థితి విషమం

అమరావతి: కర్నూలు జిల్లా హోళగుంద మండడలం దేవరగట్టులో దసరా ఉత్సవాల్లో భాగంగా జరిగిన బన్నీ ఉత్సవంలో 2 లక్షల మంది వరకు పాల్గొన్నట్టు తెలుస్తోంది. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలు గట్టుపైకి చేరుకున్నారు. అర్ధరాత్రి తర్వాత మాళ మల్లేశ్వరస్వామి కల్యాణం జరగ్గా ఆపై ఉత్సవమూర్తుల కోసం కర్రల కొట్లాట ప్రారంభమైంది. మాళ మల్లేశ్వరస్వామి బన్ని జైత్రయాత్రలో రెండు వర్గాల మధ్య కర్రలతో ఘర్షణకు దిగాయి. దేవతామూర్తులను తీసుకెళ్లే విషయంలో పోటీ పడటంతో ఈ హింస మొదలైంది. చాలా మందికి తలలు పగిలి తీవ్ర గాయాలు కావడంతో తాత్కాలిక వైద్య శిబిరంలో చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించారు.

100 మందికి పైగా గాయాలు

దేవరగట్టులో జరిగిన కర్రల సమరం హింసాత్మకంగా మారింది. ఉత్సవ మూర్తులను దక్కించుకునేందుకు మూడు గ్రామాల ప్రజలు ఒకవైపు, ఏడు గ్రామాల ప్రజలు ఒకవైపు కర్రలతో తలపడ్డారు. నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఒకవైపు.. అరికెర, అరికెరతండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం గ్రామాల భక్తులు మరోవైపు ఉంటారు. రెండు వర్గాలు పరస్పరం కర్రలతో దాడులు చేసుకోగా 100 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరు మరణించారు. మరో ఐదుగిరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆదోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 800 మంది పోలీసులతో చేపట్టిన బందోబస్తు చర్యలు ఫలించలేదు. ఈ కర్రల సమరాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో జనం తరలి వచ్చారు.

మాల మల్లేశ్వర స్వామి ఉత్సవ ప్రత్యేకత: దేవరగట్టులోని ఒక కొండపై ఉన్న మాల మల్లేశ్వర స్వామి ఆలయం దసరా వేడుకలకు ప్రధాన కేంద్రం. ప్రతి సంవత్సరం, దసరా రోజున, అర్ధరాత్రి, మాలమ్మ మరియు మల్లేశ్వర స్వామి దేవతల వివాహం జరుగుతుంది. ఆ తరువాత, ఉత్సవ విగ్రహాలను దీపాల వెలుగులో ఊరేగింపుగా బయటకు తీసుకువెళతారు. ఈ విగ్రహాలను దక్కించుకోవడానికి 10 గ్రామాల ప్రజలు రెండు గ్రూపులుగా విభజించబడి కర్రలతో పోరాడుతారు. ఈ యుద్ధాన్ని "బన్నీ ఉత్సవ్" అంటారు.

Next Story