ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా..!
SSC exams post pone in Andhra pradesh.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 25 May 2021 7:55 AM GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పరీక్షలను నెలరోజుల పాటు వాయిదా వేయాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కరోనా కట్టడి దృష్ట్యా ఈనెల 31 వరకు కర్ఫ్యూ అమల్లో ఉండటం.. కొన్ని పాఠశాలలను ఇప్పటికే క్వారంటైన్ కేంద్రాలుగా మార్చడంతో.. పరీక్షలకు ఏర్పాట్లు చేయడం కష్టంగా మారిందని విద్యాశాఖ పేర్కొంది.
అలాగే.. టెన్త్ పరీక్షలపై వివిధ రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాలను విద్యాశాఖ తన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరాఖండ్, హరియాణ, మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షలను రద్దు చేయగా.. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గోవా, రాజస్థాన్, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్, అసోం రాష్ట్రాలు వాయిదా విషయాన్ని గుర్తు చేసింది. బీహార్, కేరళలో మాత్రం ఇప్పటికే పరీక్షలు పూర్తి అయ్యాయి.
ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో పరీక్షలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది. కాగా.. పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు సీఎం కార్యాలయానికి చేరుకున్నాయి. దీనిపై మరో రెండు, మూడు రోజుల్లో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
మరోవైపు ఏపీ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తే.. భవిష్యత్తులో తీసుకునే నిర్ణయం కోసం ముందుగా అంతర్గత మార్కుల నమోదు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. మూడు, నాలుగు రోజుల్లో అంతర్గత పరీక్షల మార్కులను ఆన్‌లైన్‌లో ఎంటర్ చేయాలని పాఠశాల ప్రధానోఫాధ్యాయులకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం.