ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్: రేపటి నుంచి ఏపీలో స్పెషల్ క్యాంప్‌లు
Special camps to update Biometric in Aadhaar from tomorrow in AP. ఆధార్‌లో బయోమెట్రిక్ అప్‌డేట్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గురువారం
By అంజి Published on 18 Jan 2023 4:10 PM IST
ఆధార్‌లో బయోమెట్రిక్ అప్‌డేట్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గురువారం నుంచి ఐదు రోజుల పాటు గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహించనుంది. ఈ నెల 19, 20, 21, 23, 24 తేదీల్లో ఆయా సచివాలయాలు, వాటి పరిధిలోని పాఠశాలల్లో ఈ శిబిరాలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు మరోసారి ఈ శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, గ్రామ వార్డు సచివాలయాల శాఖ జిల్లా ఇన్ ఛార్జి అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ శిబిరాల ద్వారా ప్రజలందరూ ఆధార్ సేవలను పొందేలా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు తగు ప్రచారం చేయాలని సూచించారు. ప్రత్యేక శిబిరాల రోజుల్లో సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్లు పూర్తిగా ఆధార్ సేవలపైనే దృష్టి సారిస్తారు. ఆధార్ కార్డు జారీ చేసే సంస్థ UIDAI ఇటీవల బయోమెట్రిక్ వివరాలను కనీసం పదేళ్లకు ఒకసారి నవీకరించడానికి కొత్త నిబంధనలను తీసుకువచ్చిన నేపథ్యంలో ఈ శిబిరాలు ఏర్పాటు చేయబడ్డాయి. రాష్ట్రంలో ఇంకా 80 లక్షల మంది ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేసుకోని వారు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఆధార్ అనుసంధానంతోనే అమలవుతున్నాయి. నవరత్నాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సుమారు 35 సంక్షేమ పథకాలు ఆధార్ అనుసంధాన బయోమెట్రిక్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. వాలంటీర్లు పారదర్శకతను కాపాడేందుకు ప్రభుత్వ ప్రయోజనాన్ని అందించడానికి ముందు, తరువాత లబ్ధిదారుల నుండి బయోమెట్రిక్‌లను తీసుకుంటున్నారు. బయోమెట్రిక్ వివరాల్లో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక శిబిరాల ద్వారా రాష్ట్ర ప్రజలందరి ఆధార్ బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేస్తున్నారు.