నేను వస్తేనే పథకాలు కొనసాగుతాయి.. లేదంటే: సీఎం జగన్
వైసీపీ పథకాలను రద్దు చేస్తానని చెప్పే దమ్ము చంద్రబాబు నాయుడికి ఉందా? అని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు.
By అంజి
నేను వస్తేనే పథకాలు కొనసాగుతాయి.. లేదంటే: సీఎం జగన్
వైసీపీ పథకాలను రద్దు చేస్తానని చెప్పే దమ్ము చంద్రబాబు నాయుడికి ఉందా? అని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసే దమ్ము ఉందా? సచివాలయ వ్యవస్థను రద్దు చేసే దమ్ము ఉందా?, జన్మభూమి కమిటీలను మళ్లీ తీసుకొస్తానని చెప్పే ధైర్యం ఉందా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. ఆదివారం మధ్యాహ్నం నెల్లూరు జిల్లా వెంకటగిరి త్రిభువని సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కాదని, భవిష్యత్‌ని నిర్ణయించే ఎన్నికలు అని అన్నారు.
జగన్ రూపాయి ఇస్తానంటే చంద్రబాబు నాలుగు రూపాయలు ఇస్తానంటారన్న సీఎం జగన్.. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమేనని అన్నారు. పేదవాడి భవిష్యత్ మారాలంటే మళ్లీ వైసీపీనే అధికారంలోకి రావాలని పేర్కొన్నారు. మరో రెండు వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోందని సీఎం జగన్ అన్నారు. ఎవరి వైపు ఉండాలో తేల్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడమేనని అన్నారు. ఆయన వస్తే సంక్షేమ పథకాలు పూర్తిగా రద్దు అవుతాయని, మరోసారి చంద్రబాబు చేతిలో మోసపోయినట్లేనని అన్నారు. ఎన్నికల యుద్ధానికి మీరు సిద్ధమా? అని ప్రజలను సీఎం జగన్ ప్రశ్నించారు.
''రూ.3 వేల పెన్షన్ అంటే గుర్తుకొచ్చేది జగన్. అమ్మఒడి అంటే గుర్తుకొచ్చేది జగన్. కాపు నేస్తం, ఈబీసీ నేస్తం అంటూ గుర్తుకొచ్చేది జగన్. 31 లక్షల ఇళ్ల పట్టాలంటే గుర్తుకొచ్చేది జగన్. మహిళా సాధికారిత అంటే గుర్తుకొచ్చేది జగన్. సంక్షేమ పథకాలంటే పేదవాడికి గుర్తుకొచ్చేది జగన్. రైతన్నల చేయిపట్టుకుని నడిపించేది ఎవరంటే గుర్తుకొచ్చేది జగన్'' అని అన్నారు. సాధ్యంకాని హామీలతో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని సీఎం జగన్ అన్నారు. తాను వస్తేనే పథకాలు కొనసాగుతాయని, మరోసారి ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కండి అని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.