జ‌గ‌న్‌కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడంపై తేల్చేసిన అయ్యన్నపాత్రుడు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏపీ అసెంబ్లీలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ప్రతి పక్ష నేత హోదా ఇవ్వడంపై కీలక వ్యాఖ్యలు చేశారు

By Medi Samrat  Published on  17 Aug 2024 4:45 PM IST
జ‌గ‌న్‌కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడంపై తేల్చేసిన అయ్యన్నపాత్రుడు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏపీ అసెంబ్లీలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ప్రతి పక్ష నేత హోదా ఇవ్వడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదట అసెంబ్లీకి రావాలని ఆయన అన్నారు. ప్రతిపక్ష హోదా విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. శాసనసభలో ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇస్తున్నామని, జగన్‌ కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చన్నారు. జగన్‌ చేయి ఎత్తి అడిగితే మాట్లాడే అవకాశం ఇస్తామని అన్నారు. జగన్‌ ప్రతిపక్ష హోదా అంశంపై చట్టపరిధిలో ఉన్నట్లుగానే నిర్ణయాలు ఉంటాయన్నారు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తిరుపతి ఎస్వీ జంతు ప్రదర్శనశాల సందర్శించి.. మొక్కలు నాటారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ అయ్యన్న ఈ వ్యాఖ్యలు చేశారు.

అసెంబ్లీలో వైఎస్ఆర్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడికి కూడా జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. ప్రతిపక్ష హోదా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో వైసీపీ పిటిషన్ కూడా వేసింది. సభలో పది శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న నియమం ఏదీ లేదని.. గతంలో లోక్‌సభలో, ఢిల్లీ అసెంబ్లీలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీట్ల శాతంతో సంబంధం లేకుండా ప్రతిపక్ష హోదా ఇచ్చారని వైసీపీ అంటోంది. 1984 లోక్‌సభ ఎన్నికల్లో 30 ఎంపీ సీట్లు వచ్చిన టీడీపీకి, 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 26 సీట్లే వచ్చిన కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా ఇచ్చారని వాదిస్తున్నారు.

Next Story