రేపు లాన్స్‌నాయక్ సాయితేజ అంత్యక్రియలు
Soldier Lance Naik Sai Tejas Funeral Tomorrow.తమిళనాడులోని నీలగిరి కొండల్లో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు
By తోట వంశీ కుమార్ Published on 11 Dec 2021 7:53 AM GMTతమిళనాడులోని నీలగిరి కొండల్లో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లా వాసి లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు రేపు(ఆదివారం) నిర్వహించనున్నట్లు ఆయన సోదరుడు మహేశ్ తెలిపారు. ఈ రోజు ఉదయం డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి సాయి తేజ మృతదేహాన్ని గుర్తించారు. ఢిల్లీ నుంచి సాయితేజ భౌతిక కాయాన్ని ఆయన స్వగ్రామాని ఎగువరేగడికి తరలిస్తున్నారు. అయితే.. సాయితేజ భౌతిక కాయం శనివారం మధ్యాహ్నాం బెంగళూరుకు చేరుకుంటుందని.. తమ గ్రామానికి తరలించే సరికి సాయంత్రం అవుతుందని మహేష్ తెలిపాడు. అందుకనే ఈ రోజు అంత్యక్రియలు నిర్వహించలేమని, ఆదివారం ఉదయం నిర్వహించనున్నట్లు చెప్పాడు.
ఈ రోజు సాయితేజ భౌతికకాయాన్ని ఆర్మీ బేస్ ఆస్పత్రిలో ఉంచాలని ఇప్పటికే ఆర్మీ అధికారులను కోరామని.. అందుకు వారు అంగీకరించారన్నాడు. ఆదివారం ఉదయం 5 గంటలకు బయలుదేరి తమ స్వగ్రామానికి ఉదయం 10 గంటల లోపు సాయి భౌతిక కాయం చేరుతుందన్నాడు. అధికార లాంఛనాలతో నిర్వహించడానికి ఇప్పటికే ఆర్మీ అధికారులు ఎగువరేగడికి చేరుకుని అన్ని ఏర్పాట్లు చేశారు. ఏపీకి చెందిన సాయితేజ సీడీఎస్ బిపిన్ రావత్‌కు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తూ హెలిక్యాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
లాన్స్‌నాయక్ సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. 50 లక్షలు అందించాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.