వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. బెంబేలెత్తిన ప్రయాణికులు

తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తున్న వందే భారత్ ట్రైన్‌లో పొగలు వ్యాపించాయి. నెల్లూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

By అంజి  Published on  10 Aug 2023 4:08 AM GMT
Smoke, Tirupati Secunderabad Vande Bharat train, man smokes cigarette, Nellore

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. బెంబేలెత్తిన ప్రయాణికులు

వందే భారత్ ట్రైన్‌లో స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద బుధవారం తిరుపతి నుంచి సికింద్రాబాద్‌ వెళ్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లోని కొన్ని బోగీల్లో పొగలు వ్యాపించాయి. టాయిలెట్‌లో ధూమపానం చేస్తున్న టికెట్ లేని ప్రయాణీకుడు సిగరెట్ పీకను డబ్బాలో వదిలివేయడంతో ఇతర ప్లాస్టిక్ పదార్థాలు కాలిపోయాయి. పోగలు వ్యాపించడంతో స్మోకింగ్‌ అలారం మోగింది. అదే సమయంలో పొగలు కొన్ని కోచ్‌లకు వ్యాపించడంతో గమనించిన సిబ్బంది లోకో పైలట్‌ను అప్రమత్తం చేశారు. మనుబోలు వద్ద రైలును నిలిపివేసి ప్రయాణికులను దించారు. అనంతరం పొగ అదుపులోకి వచ్చింది. పొగకు కారణమైన ప్రయాణికుడిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) అరెస్టు చేశారు.

ఈ ఘటనతో దాదాపు 30 నిమిషాల పాటు ఆలస్యమైంది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆ తర్వాత సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దటంతో ట్రైన్ తిరిగి బయలుదేరింది. దక్షిణ మధ్య రైల్వే ప్రకారం.. వ్యక్తి టికెట్ లేకుండా రైలు నంబర్ 20702 యొక్క C-13 కోచ్‌లోకి ప్రవేశించి టాయిలెట్‌లో తాళం వేసుకున్నాడు. అతను సిగరెట్ తాగిన తర్వాత, ఆటోమేటిక్ ఏరోసోల్ ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ ఆఫ్ అయ్యింది. మంటలను ఆర్పడానికి పౌడర్ లాంటి పదార్థాన్ని విడుదల చేసింది. ఆ ప్రయాణికుడిని నెల్లూరులో ఎక్కాడని, రైల్వే చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని ఎస్‌సీఆర్‌ తెలిపింది.

Next Story