ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో ప్రజలను మోసం చేసిన ఆరోపణలపై అనకాపల్లిలో స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ ఇందుపూడి సుధాకర్‌ను మంగళగిరి సీఐడీ అరెస్టు చేసింది. అతన్ని కాకినాడ కోర్టులో హాజరుపరిచారు. తూర్పుగోదావరికి చెందిన జి.రవికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐడీ పోలీసులు తెలిపారు. రవి కుమార్‌ను సొసైటీ మోసం చేసిందని ఆరోపించారు. ఇందుపూడి సుధాకర్, రుత్తల హరిబాబు, కె.శివ తదితరులు స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీని ప్రారంభించి నిరుద్యోగ యువతను ఏపీ, కేంద్ర ప్రభుత్వాల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు ఎర చూపారని సీఐడీ పేర్కొంది.
7 వేల మంది నిరుద్యోగుల నుంచి రూ.300 కోట్లు వసూలు చేశారు. ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.1.5 లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు దండుకున్నాడు. ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి మండలం నుంచి కనీసం 20 మంది బాధితులు ఉన్నారు. అనంతరం నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు, ఐడీ కార్డులు ఇచ్చి కొంతకాలంగా జీతాలు చెల్లించారు. వేతనాలు ఆపివేసి అదృశ్యమయ్యారు. నిందితులను అరెస్టు చేయడానికి ముందు సీఐడీ 50 మంది బాధితులను పరీక్షించింది. మంగళగిరిలోని సీఐడీలో సెక్షన్ 420తోపాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
నర్సీపట్నంకు చెందిన సుధాకర్ మోసాలు బట్టబయలవుతుంటే సీఐడీ పోలీసులకే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. సుధాకర్ గ్రామాల్లో ఉద్యోగాల పేరుతో వసూళ్లకు పాల్పడ్డాడు. దీనికోసం కొందరు మధ్యవర్తులను నియమించుకున్నాడు. డబ్బులు ఇచ్చిన వారికి సుధాకర్.. జిల్లా ఏవో, మండల ఇన్‌చార్జి, మూడు నాలుగు పంచాయతీలకు ఎగ్జిక్యూటివ్ అంటూ జాబ్ అపాయింట్‌మెంట్ లెటర్‌లను అందించాడు. ఆ తర్వాత శిక్షణ పేరుతో కొంత మొత్తం వేతనం అందించాడు. తొలినెల వేతనం ఇచ్చిన సుధాకర్ తర్వాత వాయిదాలు వేస్తూ రావడంతో బాధితులు ఏం చేయలేకపోయారు. ఐదు నెలలు దాటినా డబ్బులు ఇవ్వక పోవడంతో కొందరు అసిస్టెంట్లు మండల ఇన్‌చార్జ్‌లను నిలదీయడంతో సుధాకర్ మోసం బయటపడింది.