AP High Court: ఎట్టకేలకు చంద్రబాబుకి బెయిల్ మంజూరు
ఏపీ హైకోర్టు చంద్రబాబుకి బెయిల్ మంజూరు చేసింది.
By Srikanth Gundamalla Published on 31 Oct 2023 11:03 AM ISTAP High Court: ఎట్టకేలకు చంద్రబాబుకి బెయిల్ మంజూరు
ఏపీ స్కిల్ డెవల్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యిన విషయం తెలిసిందే. చంద్రబాబుకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. తాజాగా ఏపీ హైకోర్టు చంద్రబాబుకి బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ నాయకులు, చంద్రబాబు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 53 రోజుల తర్వాత చంద్రబాబుకి ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయ్యింది.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసులో అరెస్ట్ అయ్యిన చంద్రబాబుకి బెయిల్ కోసం ఆయన తరఫు న్యాయవాదులు తీవ్ర ప్రయాత్నాలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మధ్యంతర బెయిల్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ కోరడంతో ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ మంజూరు అవ్వడంతో ఆ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్య కారణాలరీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని చంద్రబాబు అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ పూర్తిచేసింది ఏపీ హైకోర్టు. తాజాగా తీర్పు వెలువరించింది. నాలుగు వారాలపాటు నవంబర్ 24 వరకు అనుమతి ఇచ్చింది. కాగా.. నవంబర్ 10న రెగ్యులర్ బెయిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టనుంది.
మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కోర్టు పలు కండీషన్లు కూడా పెట్టింది. రూ.లక్ష చొప్పున పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. తనకు నచ్చిన ఆస్పత్రిలో సొంత ఖర్చులతో చికిత్స పొందాలని పేర్కొంది. సరెండర్ అయ్యే సమయంలో చికిత్స, ఆస్పత్రి వివరాలను సీల్డ్ కవర్‌లో జైలు సూపరింటెండెంట్‌కు సమర్పించాలని హైకోర్టు సూచించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏసీబీ కోర్టు బెయిలు ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసులో చంద్రబాబు సెప్టెంబర్ 9న అరెస్ట్ అయ్యారు. నంద్యాలలో చంద్రబాబుని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత 10వ తేదీన ఉదయం ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఆ తర్వాత 10వ తేదీ అర్థరాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబుని తరలించారు. పలుమార్లు రిమాండ్ పొడిగింపుతో.. 53 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉన్నారు.