కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ జిల్లాగా మార్చడాన్ని నిరసిస్తూ నిన్న(మంగళవారం) చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. అమలాపురం పట్టణాన్ని దిగ్బంధించారు. పట్టణాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇతర జిల్లాల నుంచి అదనపు బలగాలను కూడా రప్పించి అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు.
ఇక అమలాపురం వైపు వచ్చే అన్ని బస్సు సర్వీసులను రద్దు చేశారు. సెల్‌ఫోన్ సిగ్నళ్లను ఇంకా పూర్తిస్థాయిలో పునరుద్దరించలేదు. నిరసనకారులు నేడు రావులపాలెంలో ప్రదర్శనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ప్రత్యేక బలగాలను అక్కడికి పంపారు. ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు, కాకినాడ ఎస్పీ రవీంద్రబాబు, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, ఎన్టీఆర్ జిల్లా ఎస్పీ సిద్ధార్థ కుషాల్, గుంటూరు ఎస్పీ విశాల్ గున్ని ప్రస్తుతం అమలాపురంలోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక కోనసీమ వ్యాప్తంగా సెక్షన్ 144, సెక్షన్ 30 అమల్లో ఉందని, ఎలాంటి ర్యాలీలు, నిరసనలు, బహిరంగ సభలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.