రాష్ట్రానికి చెందిన సిక్కు పెద్దలతో సమావేశమైన సీఎం జగన్
Sikh Religion Leaders Meets CM Jagan. రాష్ట్రానికి చెందిన సిక్కు పెద్దలతో సీఎం వైయస్ జగన్ సమావేశమయ్యారు. ఏపీ స్టేట్ మైనార్టీస్ కమిషన్ సభ్యుడు
By Medi Samrat Published on 8 May 2023 11:30 AM GMTSikh Religion Leaders Meets CM Jagan
రాష్ట్రానికి చెందిన సిక్కు పెద్దలతో సీఎం వైయస్ జగన్ సమావేశమయ్యారు. ఏపీ స్టేట్ మైనార్టీస్ కమిషన్ సభ్యుడు జితేందర్‌జిత్ సింగ్ నేతృత్వంలో సీఎం జగన్‌ను కలిశారు సిక్కు పెద్దలు. ఈ సందర్భంగా ఒక శతాబ్దం కిందటి నుంచి సిక్కులు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు సీఎంకు వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన వారికి ప్రభుత్వం పథకాలు, ప్రయోజనాలు అందుతున్నాయని సిక్కు పెద్దలు సీఎంకు తెలిపారు. సిక్కులు, వారికి అనుబంధంగా ఉంటున్న వారి కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నవరత్నాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు సిక్కు పెద్దలు. సిక్కుల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
గురుద్వారాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలన్న సిక్కు పెద్దల విజ్ఞప్తికి సీఎం అంగీకరించారు. గురుద్వారాలపై ఆస్తి పన్ను తొలగించాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. గురుద్వారాల్లోని పూజారులైన గ్రంధీలకు.. పూజారులు, పాస్టర్లు, మౌల్వీల మాదిరిగానే ప్రయోజనాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. గురునానక్ జయంతి రోజైన కార్తీక పౌర్ణమి నాడు సెలవుదినంగా ప్రకటించేందుకు సీఎం అంగీకారం తెలిపారు. ఒక మైనార్టీ విద్యాసంస్థను పెట్టుకునేందుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు సీఎం. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి తీర్మానం కూడా చేస్తామని తెలిపారు సీఎం.
వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా సిక్కులకు అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. వివిధ సామాజిక వర్గాలు నిర్వహిస్తున్న ఎంఎస్‌ఎంఈల వ్యాపారాలను పెంచే క్రమంలో ఈ చర్యలు ఉండాలని సీఎం పేర్కొన్నారు. 10 రోజుల్లోగా ఇవన్నీ కొలిక్కి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఏ ఎండి ఇంతియాజ్ పాల్గొన్నారు.