తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన కాళీకృష్ణ భగవాన్ (20) ఆత్మహత్యపై పూర్తిస్థాయి విచారణకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ బుధవారం ఆదేశించింది. ఈ ఘటనపై జిల్లా అదనపు ఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని తూర్పుగోదావరి ఎస్పీ, రామచంద్రపురం డీఎస్పీ, మండపేట సీఐ (ప్రస్తుతం వీఆర్వో), మండపేట స్టేషన్ అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ఏప్రిల్ 11వ తేదీలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
ప్రేమ వ్యవహారంలో ప్రియురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మండపేట టౌన్ సీఐ దుర్గాప్రసాద్ కాళీకృష్ణ భగవాన్ ను స్టేషన్ కు పిలిపించి కొట్టి చంపారని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ కుటుంబ సభ్యులు, స్థానికులు మంగళవారం ధర్నాకు దిగారు. ఈ ఘటనపై మీడియా కవరేజీ ద్వారా హెచ్‌ఆర్‌సీ కేసును సుమోటోగా స్వీకరించింది. హెచ్‌ఆర్‌సీ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామమూర్తి, జ్యుడీషియల్ సభ్యుడు దండే సుబ్రమణ్యం, నాన్ జ్యుడీషియల్ సభ్యుడు జి శ్రీనివాసరావు నోటీసులు జారీ చేసినట్లు సెక్షన్ ఆఫీసర్ బి తారక నరసింహకుమార్ తెలిపారు.