జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయినా రాపాక మాత్రం తూర్పు గోదావరి జిల్లా రోజోలు నుంచి గెలిచి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. జనసేన ఎమ్మెల్యేగా కొనసాగుతూనే వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు. జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడమే కాకుండా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా, సీఎం జగన్ కు అనుకూలంగా ఆయన మాట్లాడుతూ ఉండడం గమనార్హం. ఇక అసెంబ్లీ సమావేశాల్లోనూ వైసీపీకి మద్దతుగా ఆయన వ్యవహరించడం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. రాపాక వరప్రసాదరావు కుమారుడు రాపాక వెంకట్ రామ్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా పాల్గొన్నారు. సాంకేతికంగా జనసేన ఎమ్మెల్యేగా కొనసాగనున్న రాపాక వరపస్రాద్ పార్టీ మారితే చిక్కులు రాకుండా ఉండేందుకే జనసేనలో కొనసాగుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.