ఎక్కడైనా ఓ పది రూపాయలు కనిపిస్తే.. అటు ఇటు చూసి జేబులో వేసుకుంటున్న ఈ రోజుల్లో ఓ మహిళకు లక్షకు పైగా విలువ చేసే బంగారం ఆభరణాలు దొరికాయి. అయితే.. సదరు మహిళ ఎంతో నిజాయితీగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించింది. ఈ ఘటన కోనసీమ జిల్లా ఆలమూరులో చోటు చేసుకుంది.
ఆలమూరు ఎస్సై శివప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోనసీమ జిల్లా అయినవిల్లి గ్రామానికి చెందిన యడ్ల సత్యవేణి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారి దర్శనానికి వచ్చింది. లక్షా 30వేలు విలువ చేసే మూడు కాసుల పుస్తెలతాడు పడేసుకుంది. అమ్మవారిని దర్శనం అనంతరం తిరిగి స్వగ్రామానికి వెళ్లింది.
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాళ్లపాలెంనకు చెందిన సింగులూరి మల్లేశ్వరికి ఆ పుస్తెలతాడు దొరికింది. వెంటనే ఆమె బందోబస్తులో ఉన్న ఎస్సై శివప్రసాద్‌కు అందజేసింది. ఆలయం వద్ద ఉన్న మైకుల ద్వారా ప్రసారం చేసిన ఎవరూ రాకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో నగను భద్రపరిచారు. కాగా.. సోమవారం ఆ బంగారపు పుస్తెలతాడు మాదేనంటూ యడ్ల సత్యవేణి ఆధారాలను పోలీసులకు చూపడంతో వస్తువులను ఆమెకు అప్పగించారు. దొరికిన బంగారపు ఆభరణాలను ఎంతో నిజాయితీతో స్థానిక ఎస్సైకి అప్పగించి, పలువురికి ఆదర్శంగా నిలిచిన మల్లేశ్వరిని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఘనంగా సత్కరించారు.