ఉక్కు మంత్రి ప్రకటనకు మీరిచ్చే సమాధానం ఏంటి.? : చంద్రబాబును ప్రశ్నించిన షర్మిల
కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర మంత్రి HD కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు మరో సారి రాష్ట్ర ప్రజలను అవమానించినట్లే అని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు.
By Kalasani Durgapraveen
కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర మంత్రి HD కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు మరో సారి రాష్ట్ర ప్రజలను అవమానించినట్లే అని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. వాటిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. అసలు ప్లాంట్ ప్రతిపాదనే తమ దగ్గర లేదని అపహస్యం చేసినట్లు మాట్లాడటం నిజంగా సిగ్గుచేటు అన్నారు. ప్రతిపాదన వస్తే ఆలోచన చేస్తామని చెప్పడం ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలతో బీజేపీ చెలగాటం ఆడుతుంది అనడానికి నిదర్శనం అన్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ఎంపీలు మౌనంగా ఉండటం వారి చేతకాని తనానికి అద్దం పడుతుందన్నారు.
కడప ఉక్కు సీమ ప్రజల హక్కు
రాష్ట్ర విభజన సమయంలో కేంద్రమే SAIL ఆధ్వర్యంలో నిర్మించి ఇచ్చేలా కాంగ్రెస్ సారథ్యంలోని UPA ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చిందని షర్మిలా రెడ్డి అన్నారు. విభజన చట్టంలోనూ పెట్టింది.. అనంతరం అధికారంలోకొచ్చిన బీజేపీ సర్కార్ విభజన హామీలను కాల రాసిందన్నారు. సీమ ప్రజల మనోభావాలను దెబ్బతీసింది. కడప ప్రజలకు తీరని ద్రోహం చేసిందన్నారు. మోడీ తిరుపతి వేదికగా కడప స్టీల్ పై హామీ ఇచ్చినన్నారు.
కడప స్టీల్ పై మీ వైఖరి ఏంటి ? కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ప్రకటనకు మీరిచ్చే సమాధానం ఏంటి ? ముఖ్యమంత్రి చంద్రబాబుని సూటిగా ప్రశ్నిస్తున్నాం అన్నారు. అసలు కేంద్రం పరిశీలనలో లేదనడం మీరు సమర్ధిస్తారా ? కడప స్టీల్ ప్లాంట్ కడతారా ? కట్టరా? అని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వమే ప్లాంట్ కడుతుందని ఒకసారి మీరు కొబ్బరి కాయ కొడితే.. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ భాగస్వామ్యం ఉండాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ రెండు సార్లు టెంకాయలు కొట్టారన్నారు. నాలుగు సార్లు శంకుస్థాపన జరిగి ఒక్క అంగుళం కూడా ముందుకు కదలని ప్రాజెక్టు ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది కడప స్టీల్ మాత్రమే అన్నారు . విభజన హక్కు ప్రకారం కడప స్టీల్ ను కేంద్రం నిర్మించి ఇచ్చేలా ప్రకటన చేయించండన్నారు. లేకుంటే భేషరతుగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి బీజేపీ కి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకొండన్నారు. కేంద్రం సహాయం లేకుండా రాష్ట్రమే నిర్మించే పనికి మోడీకి భజన చేయాల్సిన అవసరం ఉందా.. తేల్చుకోండి అని అన్నారు.