ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మాచర్లలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ1గా చేర్చినట్టు రాష్ట్ర సీఈవో ముకేష్ కుమార్ మీనా తెలిపారు. మొత్తం 10 సెక్షణ్ల కింద మెమె ఫైల్ చేశామన్నారు. నిన్నటి నుంచి ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. పిన్నెల్లిపై సివియర్ సెక్షన్లు పెట్టినట్టు వివరించారు. రెండేళ్లకుపైన జైలు శిక్ష పడితే పిన్నెల్లి ఎమ్మెల్యేగా గెలిచినా, అనర్హత వేటు పడే అవకాశం ఉంటుందని తెలిపారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఆయన విదేశాలకు పారిపోయేందుకు చూస్తున్నారన్న సమాచారంతో లుకౌట్ నోటీసులు జారీ చేసి, అన్ని ఎయిర్‌పోర్టులను అప్రమత్తం చేశారు. ఐపీసీ, ఆర్‌పీ, పీడీపీపీ చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు. ఐపీసీ కింద 143, 147, 448, 427, 353,452,120 బిసెక్షన్లు, పీడీపీపీ కింద మరో కేసు, ఆర్‌పీ చట్టం 131, 135 సెక్షన్లతో.. ఈ నెల 20వ తేదీ పిన్నెల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన ఈవీఎమ్‌లో డేటా సేఫ్‌గా ఉందని సీఈవో ముకేష్ కుమార్ మీనా తెలిపారు. అక్కడ కొత్త ఈవీఎంతో పోలింగ్ కొనసాగించామని వివరించారు. పోలింగ్ నాడు మాచర్లలో ఇలాంటివి ఏడు సంఘటనలు జరిగాయని, అందులో కొందరు ఈవీఎంలను ధ్వంసం చేసినట్టు వెబ్‌కాస్టింగ్‌లో గుర్తించామని వెల్లడించారు. ఈ కేసులో ఇంకా కొందరిని గుర్తించాల్సి ఉందన్నారు.