బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఇవాళ తుపానుగా మారే ఛాన్స్: ఐఎండీ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం సాయంత్రానికి తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బులెటిన్‌లో పేర్కొంది.
By అంజి Published on 23 Oct 2023 11:24 AM ISTబంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఇవాళ తుపానుగా మారే ఛాన్స్: ఐఎండీ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం సాయంత్రానికి తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బులెటిన్‌లో పేర్కొంది. తుఫాను ఏర్పడిన తర్వాత దీనిని ఇరాన్ పెట్టిన పేరు 'హమూన్' అని పిలుస్తారు. అల్పపీడనం ఆదివారం రాత్రి ఈశాన్య దిశగా కదిలిన తర్వాత ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉంది. ఇది ఒడిశాలోని పారాదీప్ నుండి 400 కి.మీ, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు నైరుతి దిశలో 550 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండంగా మారిన తర్వాత దాని దిశ గమనాన్ని బట్టి ఈ నెల 24, 25 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
"రాబోయే 12 గంటల్లో ఇది తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇది ఉత్తర - ఈశాన్య దిశగా కదులుతూ అక్టోబర్ 25 సాయంత్రం తీవ్రమైన అల్పపీడనంగా బంగ్లాదేశ్ తీరాన్ని ఖేపుపరా, చిట్టగాంగ్ మధ్య దాటే అవకాశం ఉంది" అని ఐఎండీ మార్నింగ్ బులెటిన్ తెలిపింది. ఒడిశా ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఎటువంటి సంఘటననైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కోరింది. భారీ వర్షాల సందర్భంలో లోతట్టు ప్రాంతాల నుండి ప్రజలను ఖాళీ చేయమని ప్రభుత్వం యంత్రాంగాన్ని ఆదేశించింది.
ఒడిశా తీరానికి 200 కిలోమీటర్ల దూరంలో ఈ వ్యవస్థ (తుఫాను) సముద్రంలో కదులుతుందని వాతావరణ శాస్త్రవేత్త యుఎస్ డాష్ తెలిపారు, దీని ప్రభావంతో సోమవారం ఒడిశా తీరప్రాంతంలో కొన్ని చోట్ల, తదుపరి రెండు రోజుల్లో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కియోంజర్, మయూర్‌భంజ్, ధెంకనల్‌తో పాటు ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు లోతైన సముద్రాల్లోకి వెళ్లవద్దని మత్స్య, జంతు వనరుల అభివృద్ధి శాఖ సూచించింది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఉత్సవాల సందర్భంగా దుర్గాపూజ నిర్వాహకులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.