నా గొంతు ఆగాలంటే.. ఎన్‌కౌంటర్ చేయండి: కోటంరెడ్డి
Sensational comments of Nellore Rural MLA Kotamreddy Sridhar Reddy. అనుమానించిన చోట ఉండకూడదని భావించే తన అధికారాన్ని వదులకున్నానని
By అంజి
అనుమానించిన చోట ఉండకూడదని భావించే తన అధికారాన్ని వదులకున్నానని వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ''నా మనసు విరిగింది. నేను ప్రాణాతిప్రాణంగా ప్రేమించిన, ఇష్టపడిన, ఆరాధించిన వైఎస్ జగన్ ప్రభుత్వంలో నా ఫోన్ ట్యాపింగ్‌కు గురైంది. అన్ని ఆధారాలు చూపించి బయటకు వచ్చా.. ఆఖరి దాకా ఉండి మోసం చేయలేదు'' అని అన్నారు. దాదాపు నెల రోజుల ముందు ఆధారం దొరికాకా దూరంగా జరిగానన్నారు. ఒక్క మాటా మాట్లాడదల్చుకోలేదన్నారు.
కానీ వైసీపీ పార్టీలోని 10 మంది మంత్రులు, ఓ సలహాదారుడు, ఓ రిజీనల్ కో ఆర్డినేటర్, అనేక మంది ఎమ్మెల్యేలు.. తనపై ఎలా మాట్లాడారో అందరికి తెలుసన్నారు. ఆ తర్వాత సమాధానం చెప్పాలనే ఉద్దేశంంతోనే తన వద్ద ఉన్న ఆధారం బయటపెట్టానని కోటంరెడ్డి చెప్పారు. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరానని, అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఆరోపణలు చేశారు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసి ఉంటే పారదర్శకత ప్రజలకు అర్థమయ్యేదన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఫోన్ ట్యాపింగ్ ఆషామాషీగా జరగదన్నారు.
తన అరెస్ట్‌కు రంగం సిద్ధమని లీకులు ఇస్తున్నారని, తనను ఏ నిమిషమైనా అరెస్ట్ చేసుకోండని కోటంరెడ్డి అన్నారు. కేసులు పెట్టి మీరు అలసిపోవాలే తప్ప.. తన గొంతు ఆగే ప్రశ్నే లేదన్నారు. తన గొంతు ఆగాలంటే ఒక్కటే పరిష్కారం అని.. ఎన్‌కౌంటర్ చేయించండని, అప్పుడే తన గొంతు ఆగుతుందన్నారు. ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ఎన్నికల వేళ తెలుస్తుందని కోటంరెడ్డి అన్నారు. అధికార పార్టీకి దూరం అవుతున్నానంటే ఎన్ని ఇబ్బందులు వస్తాయో తనకు తెలుసునని, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని కాదని అన్నారు.