Andrapradesh: ఒత్తిళ్లు ఏం లేవు, వ్యక్తిగత కారణాలే..ఐపీఎస్‌కు సిద్ధార్థ్ కౌశల్ వీఆర్ఎస్
ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
By Knakam Karthik
Andrapradesh: ఒత్తిళ్లు ఏం లేవు, వ్యక్తిగత కారణాలే..ఐపీఎస్‌కు సిద్ధార్థ్ కౌశల్ వీఆర్ఎస్
ఆంధ్రప్రదేశ్: ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో, కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల తన రాజీనామాను పలు నిరాధార ఆరోపణలతో అనుసంధానం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే అవన్నీ పూర్తిగా అబద్ధమని, తన రాజీనామా పూర్తిగా వ్యక్తిగత, స్వచ్ఛంద నిర్ణయమేనని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తన సేవా కాలాన్ని అత్యంత సంతృప్తికరమైన ప్రయాణంగా పేర్కొంటూ… ఈ రాష్ట్రాన్ని సొంత ఊరిగా భావించానని, ఇక్కడి ప్రజలపై తనకున్న ప్రేమ ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సీనియర్లకు, సహచరులకు, జూనియర్లకు, తనకు సేవ చేసే అవకాశం ఇచ్చిన ప్రతి పౌరుడికి కృతజ్ఞతలు తెలిపారు. తమ మద్దతుతోనే తాను ఈ స్థితికి చేరినట్టు పేర్కొన్నారు. ముందుకు సాగుతున్న తాను, సమాజానికి కొత్త రీతుల్లో సేవ చేయాలని, కృతజ్ఞత, స్పష్టత, దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లాలని తన సంకల్పాన్ని తెలియజేశారు. కాగా 2012 బ్యాచ్‌కు చెందిన సిద్ధార్థ్ గతంలో కృష్ణా, ప్రకాశం, కడప జిల్లాల్లో ఎస్పీగా పని చేశారు. ప్రస్తుతం ఆయన డీజీపీ కార్యాలయంలో ఎస్పీ (అడ్మిన్)గా విధులు నిర్వర్తిస్తున్నారు.