ఏపీలో హిందూ దేవాలయాలు, దేవతా విగ్రహాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహాం శిరచ్చేదం ఘటన మరువకముందే.. ఈ సారి సీతమ్మ విగ్రహాంపై దాడి జరిగింది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌కు సమీపంలో ఉన్న సీతారామమందిరంలో సీతమ్మ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఉదయం గమనించిన పూజాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు మొత్తం పరిశీలించారు. ఎలుకలు లేదా గాలికి విగ్రహాం కిందపడి పగిలి ఉంటుందని సీఐ అనడంతో.. అక్కడే ఉన్న టీడీపీ నాయకులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. దర్యాప్తు చేయకుండా ఎలా నిర్థారణకు వస్తారని ప్రశ్నించారు. ఈ వార్త తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలో జరగకుండా అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే.. రామతీర్థంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన నాయకులు రామతీర్థంలో పర్యటిస్తున్నారు. దీంతో అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రామతీర్థం ఘటన..రాజకీయ రంగు పులుముకోవడంతో.. అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.