Andrapradesh: మావోయిస్టుల అరెస్టుతో సచివాలయం వద్ద సెక్యూరిటీ పెంపు
రాష్ట్రంలో మావోయిస్టుల అరెస్టు, ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఏపీ సచివాలయం వద్ద పోలీసులు భద్రతను పెంచారు.
By - Knakam Karthik |
Andrapradesh: మావోయిస్టుల అరెస్టుతో సచివాలయం వద్ద సెక్యూరిటీ పెంపు
అమరావతి: రాష్ట్రంలో మావోయిస్టుల అరెస్టు, ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఏపీ సచివాలయం వద్ద పోలీసులు భద్రతను పెంచారు. విజయవాడలో మావోయిస్టులు అరెస్టు నేపథ్యంలో సచివాలయంతో పాటు సచివాలయం పరిసర ప్రాంతాల్లో భద్రతను పెంచిన పెంచారు. మావోయిస్టులు విజయవాడ పరిసర ప్రాంతాల్లో రెక్కి నిర్వహించడంతో భద్రత పెంచారు. సచివాలయానికి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి, ఉద్యోగుల ఐడీ కార్డ్స్ పరిశీలించిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. వారం రోజుల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయానికి రావడంతో భద్రతను పెంచినట్లు పోలీసులు చెబుతున్నారు.
కాగా, అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో వరుసగా రెండు రోజుల్లో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా కీలక నేతలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరోవైపు, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో 50 మందికి పైగా మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు.. అయితే విజయవాడ శివార్లలోని కానూరు కొత్త ఆటోనగర్ ప్రాంతంలో పెద్దఎత్తున మావోయిస్టులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. సుమారు పది రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక మావోయిస్టు బృందం నగరంలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. వీరు స్థానికులను నమ్మించేందుకు కూలీల వేషంలో వచ్చి, ఆటోనగర్‌లోని ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని షెల్టర్‌గా మార్చుకున్నారు. మావోల కదలికలపై పక్కా సమాచారం అందిన వెంటనే, కేంద్ర బలగాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక దళాలైన ఆక్టోపస్ (OCTOPUS), గ్రేహౌండ్స్ దళాలు రంగంలోకి దిగాయి. మంగళవారం తెల్లవారుజామున ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని, ఏమాత్రం ప్రతిఘటనకు అవకాశం ఇవ్వకుండా మెరుపుదాడి చేసి 27 మందిని అదుపులోకి తీసుకున్నాయి. అరెస్ట్ అయిన వారిలో 12 మంది మహిళా మావోయిస్టులు, నలుగురు కీలక నేతలు, 11 మంది మిలీషియా సభ్యులు, సానుభూతిపరులు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.