రాష్ట్ర వ్యాప్తంగా.. 4 దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల సరళిపై.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. మీడియాకు వివరాలు వెల్లడించారు. 16 శాతం స్థానాలకు మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయని చెప్పారు. సుమారు 10,890 మంది సర్పంచులు నేరుగా ఎన్నికయ్యారుని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో యంత్రాంగం అంకితభావంతో పనిచేసిందని ప్రశంసించారు.
ఎంతో విజ్ఞత, సంయమనంతో వ్యవహరించడం వల్లే సాధ్యమైందని అన్నారు. ప్రతి విడతలోనూ అన్ని శాఖల ఉద్యోగులు పాల్గొన్నారని.. పోలీసు సిబ్బంది సైతం ఎన్నికల ప్రక్రియలో పాల్గొని పటిష్టంగా పనిచేశారని చెప్పారు. ఒకట్రెండు చోట్ల ఇబ్బందులున్నా క్షేత్రస్థాయిలో సమన్వయం చేశారన్నారు.
నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జయప్రదంగా ముగిశాయి. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదు, రీపోలింగ్ లేదు. ఎక్కడా ఎన్నికలు వాయిదా పడలేదు. రాజకీయ వర్గాలు, ఓటర్లు విజ్ఞతతో వ్యవహరించారు. ఈ ప్రక్రియ ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరుస్తుంది. 2,197 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 10,890 మంది సర్పంచులుగా, 47,500 మంది వార్డు మెంబర్లు గెలిచారు. ఒక్కో విడతలో 90 వేలకు పైగా సిబ్బంది పనిచేశారు. 50 వేలమందికి పైగా పోలీసులు సమర్థంగా పనిచేశారు అని అన్నారు.