ఏపీ ప్ర‌భుత్వానికి ఊర‌ట‌.. రేష‌న్ వాహ‌నాల‌పై వెన‌క్కి త‌గ్గిన నిమ్మ‌గ‌డ్డ‌

SEC Nimmagada took back his decision on Ration vehicles.ఏపీలో అటు ప్రభుత్వానికి ఇటు ఎన్నికల కమిషనర్‌కు మధ్య వార్‌,రేష‌న్ వాహ‌నాల‌పై వెన‌క్కి త‌గ్గిన నిమ్మ‌గ‌డ్డ‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 March 2021 6:06 PM IST
SEC Nimmagada took back his decision on Ration vehicles

ఏపీలో అటు ప్రభుత్వానికి ఇటు ఎన్నికల కమిషనర్‌కు మధ్య వార్‌ కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికలకు ముందు నుంచి కొనసాగుతున్న రాద్ధాంతం.. పంచాయతీ ఎన్నికల్లో మరింత ముదిరింది. ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వంతో సై అంటే సై అన్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ తొలిసారిగా వెనక్కి తగ్గారు. రేషన్‌ సరుకుల డెలివరీ వాహనాల రంగు మార్చు విషయంలో ఆయన తన నిర్ణయాన్నిమార్చుకున్నారు. వాహనాల రంగు మార్చాలన్న ఆదేశాలను నిమ్మగడ్డ రమేష్‌ వెనక్కి తీసుకున్నారు. కాగా, ఎస్‌ఈసీ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఎస్ఈసీ తన ఆదేశాలు వెనక్కి తీసుకోవడంతో పిటిషన్ ను డిస్పోజ్ చేసింది కోర్టు. నిమ్మగడ్డ రమేష్‌ తన ఆదేశాలు వెనక్కి తీసుకోవడంతో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ రేషన్‌ వాహనాలను తిప్పుకొనే అవకాశం ప్రభుత్వానికి దొరికింది.

ఏపీలో స్థానిక సంస్థలు జరుగుతున్న వేళ వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన రేషన్‌ పంపిణీ వాహనాలపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ ఆంక్షలు విధించారు. వైసీపీ జెండా రంగులు, సీఎం జగన్‌ ఫోటోతో ఉన్న వాహనాలను తిప్పడం ద్వారా వైసీపీకి మేలు జరుగుతుందని విపక్షాల నుంచి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వాహనాలపై ఉన్న పార్టీ రంగులను మార్చాలని ఫిబ్రవరి 5న ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చారు. ఇక దీనిపై ప్రభుత్వం హైకోర్టులో సవాల్‌ చేసింది. ఈ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్దంగా, ఏకపక్షంగా ప్రకటించాలని కోరుతూ హైకోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఇంటింటికి రేషన్‌ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో అడ్డుకోకుండా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరింది. అలాగే వాహనాల రంగులు మార్చాలంటే కనీసం మూడు నెలల సమయం పడుతుందని, అందుకు ఖర్చు కూడా భారీగానే ఉంటుందని, దీంతో ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందని కోర్టుకు తెలిపింది ప్రభుత్వం.

ఎన్నికల నియమావళి అమల్లోకి రాకముందే పథకం ప్రారంభించామని.. దీన్ని అడ్డుకోకుండా ఎస్‌ఈసీని ఆదేశించాలని ప్రభుత్వం కోర్టుకి విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. రేషన్ డోర్ డెలివరీ వాహనాలకు రంగులు మార్చాలన్న ఎస్ఈసీ ఆదేశాలను సస్పెండ్ చేసింది. మార్చి 15 వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని వెల్లడించింది. రేషన్‌ వాహనాలను రంగు మార్చి తిప్పుకునేందుకు అభ్యంతరం లేదని ముందుగా చెప్పిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ తరఫు న్యాయవాదులు, ఆ తర్వాత తమ నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారు. దీంతో పిటిషన్‌ను డిస్పోజ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. ఏపీలో స్ధానిక ఎన్నికల వేళ ఈ నిర్ణయం ప్రభుత్వానికి భారీ ఊరటగా మారింది.




Next Story