ఎంపీటీసీ, జెడ్పిటీసీ ఎన్నికలపై ఎస్ఈసీ సంచలన నిర్ణయం
SEC Key decesion on ZPTC MPTC election nominations. ఏపిలో ముందు నుండీ భావిస్తునట్టుగానే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) విడుదల చేసింది.
By తోట వంశీ కుమార్ Published on 18 Feb 2021 8:08 PM ISTఏపిలో ముందు నుండీ భావిస్తునట్టుగానే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) విడుదల చేసింది. పాత నోటిఫికేషన్ నే ఎస్ఈసీ కొనసాగించ నున్నది. ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే ఎస్ఈసీ కొనసాగించ నున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు 75 మున్సిపాలిటీలు, 12 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. జడ్పిటిసీ, ఎంపీటీసీలకు సంబంధించి జరిగిన ఏకగ్రీవాలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి .
పూర్తి స్థాయిలో దౌర్జన్యం కాండ చెలరేగిందనే విమర్శలను ప్రతిపక్ష పార్టీలు చేశాయి. ఫలితం గానే అప్పట్లో జరిగిన ఏకగ్రీవ ఎన్నికలను రద్దు చేయాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో కూడా ప్రతిపక్ష పార్టీల నుంచి ఇదే రకమైన డిమాండ్ వచ్చింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
గతంలో ప్రలోభాలు, బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయనివారికి ఎస్‌ఈసీ మరో అవకాశం కల్పించారు. అభ్యర్థులు తమ దగ్గర ఉన్న అన్ని ఆధారాలతో జిల్లా కలెక్టర్‌ను కలిస్తే మళ్లీ నామినేషన్ వేసేందుకు అవకాశిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. పలు పార్టీల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఫిబ్రవరి 20లోపు ఇటువంటి నామినేషన్ల వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్లను నిమ్మగడ్డ ఆదేశించారు.
గతంలో నామినేషన్లు వేసేప్పుడు ప్రత్యర్ధులు అడ్డుకున్న సమయంలో రిటర్నింగ్ అధికారులకు, పోలీసులకు చేసిన ఫిర్యాదు పేపర్లను, టీవీ వీడియో క్లిప్పింగుల ఆధారాలను కూడా ఇవ్వాలని ఎస్ఈసీ తెలిపింది. ఒకవేళ అలాంటి సదుపాయాలు లేకుంటే.. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా.. విజువల్స్ ఆధారంగా కూడా బాధితులు కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల కమిషన్ ఓ ప్రకటనతో తెలియ చేసింది.
బెదిరింపులపై మీడియాలో వచ్చిన వార్తలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. అటువంటి వారు ఎవరైనా ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరారు. ఆయా రాజకీయపక్షాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రమేశ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు.