'11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది'.. తెలుగు విద్యార్థిని మృతిపై అమెరికా పోలీసు వెకిలి మాటలు

అమెరికాలోని సియాటిల్‌లో ఏపీకి చెందిన జాహ్నవి(23) దుర్మరణం పాలైంది. ఈ ఘటనపై సియాటిల్‌కి చెందిన ఓ పోలీసు అధికారి జోకులు వేసుకుంటూ నవ్వుతూ మాట్లాడాడు.

By అంజి  Published on  14 Sep 2023 2:09 AM GMT
Seattle cop, student, Andhra Pradesh

'11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది'.. తెలుగు విద్యార్థిని మృతిపై అమెరికా పోలీసు వెకిలి మాటలు

జాహ్నవి కందుల.. సౌత్ లేక్ యూనియన్‌లోని నార్త్‌ఈస్ట్రన్ యూనివర్శిటీ క్యాంపస్‌కు చెందిన 23 ఏళ్ల విద్యార్థిని. ఆమె స్వస్థలం భారత్‌లోని ఆంధ్రప్రదేశ్‌లో గల కర్నూలు జిల్లా ఆదోని. పైచదువుల కోసం జాహ్నవి అమెరికాకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి 23న సియాటిల్‌ నగరంలోని డెక్స్టర్ అవెన్యూ నార్త్ అండ్‌ థామస్ స్ట్రీట్ సమీపంలో నడుచుకుంటూ వెళుతుండగా కెవిన్ డేవ్ నడుపుతున్న సీయాటిల్ పోలీసు వాహనం ఆమెను ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన జాహ్నవి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై సియాటిల్‌ నగరానికి చెందిన ఓ పోలీసు అధికారి జోకులు వేసుకుంటూ నవ్వుతూ మాట్లాడారు. ఆ మాటలన్నీ అతడి బాడీకామ్‌ కెమెరాలో రికార్డయ్యాయి.

అవి తాజాగా వెలుగులోకి రావడంతో ఆయన తీరుపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న దృశ్యాల్లో పోలీసు అధికారి డేనియల్‌ అడెరెర్‌ ఈ కేసు దర్యాప్తు గురించి మాట్లాడడం వినిపించింది. కనీసం మానవత్వం చూపకుండా కారుతో గుద్దేసిన తరువాత "ఆమె చనిపోయింది, ఆమె చాలా మాములు మనిషి, 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది హహహ " అంటూ వెకిలిగా నవ్వుతు సీటెల్ పోలీస్ అధికారి డేనియల్ అడెరర్ మాట్లాడాడు. ఆ సమయంలో పగలబడి నవ్వుకున్నారు. ఈ వీడియోపై సియాటిల్‌ కమ్యూనిటీ పోలీసు కమిషన్‌ తీవ్రంగా పరిగణించడంతో పాటు డేనియల్‌, అతని సహోద్యోగి మధ్య జరిగిన సంభాషణ దిగ్భ్రాంతి కలిగించిందని.. దీనిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన ఫుటేజీని డిపార్ట్‌మెంట్ సెప్టెంబర్ 12 మంగళవారం విడుదల చేసింది.

Next Story