భయపెడుతున్న పురుగు.. రాష్ట్రంలో పెరుగుతున్న స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి కేసులు

రాష్ట్రంలో స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి కేసులు కలకలం రేపుతున్నాయి. చిత్తూరు, కాకినాడ, విశాఖలో 500కుపైగా కేసులు ఉన్నట్టు అధికారులు తెలిపారు.

By -  అంజి
Published on : 1 Dec 2025 11:18 AM IST

Scary insect, Scrub typhus cases,  Andhra Pradesh

భయపెడుతున్న పురుగు.. రాష్ట్రంలో పెరుగుతున్న స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి కేసులు

అమరావతి: రాష్ట్రంలో స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి కేసులు కలకలం రేపుతున్నాయి. చిత్తూరు, కాకినాడ, విశాఖలో 500కుపైగా కేసులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ లక్షణాలతో విజయనగరంలో ఓ మహిళ మరణించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆమెకు చేసిన పరీక్షల్లో స్క్రబ్‌ టైఫస్‌ లక్షణాలు నిర్దారణ అయినట్టు సమాచారం. ఈ వ్యాధి వస్తే.. జ్వరం, వాంతులు, అలసట, దగ్గు లాంటి లక్షణాలు ఉంటాయని ఫీవర్‌ తగ్గకపోతే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇది అంటు వ్యాధి కాదని వైద్యులు తెలిపారు. నల్లి తరహా ఉండే ఈ చిన్న పురుగు ఓరియంటియా సట్సుగముషి అనే బ్యాక్టీరియా రూపం. సాధారణంగా ఇళ్లల్లో మంచాలు, దివాన్లపై ఏళ్లుగా వాడే దిండ్లలో ఇటువంటి కీటకాలు చేరుతాయి.ఇది కుడితే చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. వారం తర్వాత జ్వరం, జలుబు, వణుకు, నీరసం, ఊపిరితిత్తుల సమస్యలు కనిపిస్తాయి. సకాలంలో వైద్యులను సంప్రదించకుంటే ప్లేట్‌లెట్స్‌ పడిపోవడం, మెదడు, తీవ్ర శ్వాస సంబంధిత సమస్యలు, వెన్నెముక ఇన్‌ఫెక్షన్‌ సోకుతాయి.

ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే స్క్రబ్‌ టైఫస్‌ ఎలీషా పరీక్ష చేయించుకోవాలి. వ్యాధి సోకిన వారికి యాంటీ బయోటిక్స్‌ ఇస్తారు. చికిత్స ప్రారంభించిన ఐదు నుంచి వారం రోజుల్లో తగ్గుతుంది. మాత్రలు ఇచ్చిన రెండురోజుల్లోనే తీవ్రత తగ్గుతుంది. మొత్తం కోర్సును తీసుకోవాల్సి ఉంటుంది. నిర్లక్ష్యంచేస్తే శ్వాసకోశ వ్యాధి, కిడ్నీ ఫెయిల్‌ కావడం, లివర్‌ ఫంక్షన్‌, కొన్ని అవయవాలు దెబ్బతింటాయి.

Next Story