ఏపీ సీఎంఓలో స్కామర్లు.. ఐఏఎస్ అధికారుల డిజిటల్ సంతకాల ఫోర్జరీ
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో వెలుగులోకి వచ్చిన డిజిటల్ సంతకాల దుర్వినియోగం కేసు కలకలం రేపుతోంది.
By అంజి Published on 13 Aug 2023 1:45 AM GMTఏపీ సీఎంఓలో స్కామర్లు.. ఐఏఎస్ అధికారుల డిజిటల్ సంతకాల ఫోర్జరీ
విజయవాడ: సీఎంవోలో పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారుల డిజిటల్ సంతకాలను దుర్వినియోగం చేసి, నకిలీ పిటిషన్లు (సీఎంపీ) సృష్టించి సొమ్ము చేసుకున్న ఐదుగురిని ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం (ఏపీ సీఐడీ) అధికారులు అరెస్టు చేశారు. నిందితులు ముఖ్యమంత్రి కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగులని, జూన్ నుంచి ఆగస్టు వరకు 66 ముఖ్యమంత్రి పిటిషన్లు (సీఎంపీ) జారీ చేసి దరఖాస్తుదారుల నుంచి రూ.30,000 నుంచి రూ.50,000 వరకు వసూలు చేశారు. సీఎంపీలను ప్రజలు సీఎంఓలోని ఎమ్మెల్యేలు, ఎంపీలకు పంపుతారు. ఈ పిటిషన్లను సంబంధిత శాఖల కార్యదర్శులకు పంపించే అధికారం ఐఏఎస్ అధికారులకు ఉంది. సిఐడి సూపరింటెండెంట్ హర్షవర్ధన్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదుగురు నిందితులు సీఎంఒలోని ఐఎఎస్ అధికారుల ఇ-ఆఫీస్ లాగిన్ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌ను ఉపయోగిస్తున్నారు.
నకిలీ పిటిషన్లతో నిందితులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ-ఆఫీస్ ద్వారా సీనియర్ ఐఏఎస్ అధికారుల డిజిటల్ సంతకాలను ఉపయోగించి సంబంధిత అధికారులకు తెలియకుండానే నిందితులు నకిలీ సీఎంపీలను సిద్ధం చేసినట్లు విచారణలో తేలింది. సీఎంపీలను ప్రాసెసింగ్ కోసం సంబంధిత శాఖలకు పంపించారు. అరెస్టయిన వారిని డేటా ఎంట్రీ ఆపరేటర్ కనమ్రాల శ్రీను, జి సీతా రామయ్య, నలజాల సాయిరాం, బి చితన్య నాయక్, అబ్దుల రజాక్‌లుగా గుర్తించారు. అధికారి రేవు ముత్యాల రాజు వద్ద జూనియర్ ఉద్యోగిగా పనిచేసిన శ్రీను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. శ్రీను సిద్ధం చేసిన హోంశాఖ సీఎంపీని గుర్తించిన సీనియర్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి క్రాస్ చెక్ చేసి అక్రమాన్ని గుర్తించడంతో వీరి మోసం బయటపడింది.
శ్రీను, ఇతరులు సీఎంవో ఇ-ఆఫీస్ లాగిన్ ఆధారాలను దుర్వినియోగం చేసారు. కార్యదర్శుల డిజిటల్ సంతకాలను ఉపయోగించి సీఎంపీలను సిద్ధం చేశారు. వారు పిటిషన్‌ను పరిష్కరించడానికి తదుపరి చర్య కోసం ఫైళ్లను సంబంధిత శాఖలకు పంపుతారు. శ్రీను మొదట్లో నకిలీ సీఎంపీలను సృష్టించి తనకు కావాల్సిన శాఖకు పంపించడం ద్వారా తన ఆర్థిక ప్రయోజనాల కోసం ఆధారాలను ఉపయోగించుకున్నాడని సీఐడీ అధికారి తెలిపారు. అనంతరం వివిధ సీనియర్ అధికారుల ఆధ్వర్యంలో ముఠాగా ఏర్పడి పనిచేస్తున్న సాయిరాం, సీతారామయ్య, నాయక్, రజాక్‌లకు తన ఆలోచనను అందించాడు. వారు ఎమ్మెల్యే లేదా ఎంపీ అభ్యర్థన లేఖలతో పాటు పిటిషనర్ల అభ్యర్థనలను తీసుకుని, వాటిని ఈ-ఆఫీస్‌లో అప్‌లోడ్ చేసి, పిటిషనర్ల నుండి రూ.30,000 నుండి రూ.50,000 వరకు వసూలు చేస్తారు. డబ్బును తమలో తాము పంచుకునేవారు. పోలీసులు ఐపీసీ సెక్షన్లు 420, 465, 471 రీడ్ విత్ 120B, సెక్షన్లు 66C, D ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసు బుక్ చేసారు.