ఒక‌ప్పుడు స‌ర్పంచ్ ప‌ద‌వికి అంత‌గా పోటీ ఉండేది కాదు. గానీ ఇప్పుడు మాత్రం స‌ర్పంచ్ ప‌ద‌వి ద‌క్కించుకోవ‌డానికి ఎంతైనా ఖ‌ర్చుచేస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పంచాయితీ ఎన్నికల నగారా మోగిన దరిమిలా.. గ్రామ పంచాయితీల్లో సర్పంచ్ పదవుల కోసం వేలం పాటలు షురూ అయ్యాయి. వేలం పాట ద్వారా వ‌చ్చిన సొమ్మును గ్రామాభివృద్దికి ఖ‌ర్చు చేయాల‌ని ఆయా ఆయా గ్రామ‌స్తులు భావిస్తున్నారు. ఇక జ‌నాభా ప్రాతిప‌దిక‌న‌.. ఏక‌గ్రీవం అయిన స్థానాల‌కు ప్ర‌భుత్వం ప్రోత్స‌హాకాలు ఇస్తామ‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడలో కొనసాగుతున్న వేలం ఆచారం మరోమారు తెరపైకి వచ్చింది. ఇక్కడి సర్పంచ్ పదవిని బీసీలకు కేటాయించగా గతరాత్రి వేలం నిర్వహించారు. మొత్తం నలుగురు సభ్యులు పాల్గొనగా ఓ వ్యక్తి రూ. 33 లక్షలకు స‌ర్పంచ్ పదవిని దక్కించుకున్నాడు. ఈ మొత్తాన్ని గ్రామంలోని శివాలయ నిర్మాణ పనులకు వినియోగించాలని గ్రామ‌ పెద్దలు నిర్ణయించారు. అంతేకాదు.. వేలంలో పదవిని దక్కించుకున్న అభ్యర్థి కాకుండా ఇంకెవరైనా ఎన్నికల బరిలోకి దిగిన‌ట్ల‌యితే.. వేలం పాట పాడి గెలిచిన అభ్య‌ర్థినే గెలిపించాల‌ని గ్రామ‌స్థులు తీర్మానించారు. అలాగే.. వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించారు.

ఇదిలా ఉంటే.. 15 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన వ్యక్తి రూ. 5 లక్షలకు సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు. అయితే, కమిటీ నిర్ణయించిన వ్యక్తి కాకుండా మరో అభ్యర్థి కూడా పోటీ చేయడంతో వేలంలో పదవి దక్కించుకున్న వ్యక్తిని దేవుడి అభ్యర్థిగా ప్రచారం చేసి గెలిపించుకున్నారు. దీంతో ఇప్పుడు ఎన్నికల్లో మరో వ్యక్తి పోటీ చేస్తే అదే పద్ధతిని అవలంబించాలని పెద్దలు నిర్ణయించారు.
తోట‌ వంశీ కుమార్‌

Next Story