అమరావతి: తిరుపతిలోని బ్లిస్ హోటల్ సర్కిల్ దగ్గర ఉన్న.. తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య విగ్రహానికి శాంటాక్లాజ్ టోపీ పెట్టడం ఆందోళనకు దారి తీసింది. ఆధ్యాత్మిక నగరంలో అపచారం జరిగిందని హిందూ సంఘాలు నిరసనకు దిగాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీశారని బజరంగదళ్ , హిందూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు పాల్పడినవారికి ఇంత అత్యుత్సాహం పనికిరాదని హిందూ సంఘాలు హెచ్చరికలు జారీ చేశాయి.
ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇంతటి అపచారానికి పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకుంటామని తెలిపారు. సనాతన ధర్మాన్ని కాపాడతామన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ ఘటనపై స్పందించాలని వైసీపీ నేత భూమన డిమాండ్ చేశారు. ప్రస్తుతం పోలీసులు.. ఈ ఘటనకు పాల్పడిన వారి కోసం గాలిస్తున్నారు.