ఆ 18 గ్రామాల్లో సంక్రాంతి పండుగను జరుపుకోరు.. ఎందుకో తెలుసా?

ముత్యాల ముగ్గులు, గొబ్బమ్మలు, భోగి మంటలతో తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఎటు చూసిఆ పండుగ సందడే కనిపిస్తోంది.

By అంజి  Published on  14 Jan 2024 1:39 AM GMT
Sankranti festival, 18 villages, Andhra Pradesh

ఆ 18 గ్రామాల్లో సంక్రాంతి పండుగను జరుపుకోరు.. ఎందుకో తెలుసా?

ముత్యాల ముగ్గులు, గొబ్బమ్మలు, భోగి మంటలతో తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఎటు చూసిఆ పండుగ సందడే కనిపిస్తోంది. దూర ప్రాంతాల నుంచి బంధువులు, ప్రత్యేక అలంకరణలతో ప్రతి ఇల్లూ సంక్రాంతి శోభతో కళకళలాడుతోంది. మనతో పాటే దేశ వ్యాప్తంగా చాలా చోట్ల ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు. ఈ సంక్రమణ జరిగే రోజునే మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. అన్ని పండుగలు చాంద్రమానం జరిపితే.. ఒక్క సంక్రాంతి మాత్రం సూర్యమానంలో జరుపుతారు. తెలుగు రాష్ట్రాల్లో దీన్ని వ్యవసాయ పండుగగా పిలుస్తారు. ఈ పండగ సమయంలో జరుపుకునే ప్రతీ వేడుకకు ఒక్కో విశిష్టత ఉంటుంది. భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, బసవన్నల కోలాహలం, కమ్మటి పొంగలి, పిండివంటలు, గాలిపటాలు, కొత్త అల్లుళ్లు, కోళ్ల పందేలు ఇలా తెలుగు రాష్ట్రాల్లో పండుగ జరుపుకునే తీరు ఆకట్టుకుంటుంది.

ఇతర రాష్ట్రాల్లో సంక్రాంతి

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వేరే రాష్ట్రాల్లో కూడా సంక్రాంతిని ఇతర పేర్లతో ఘనంగా జరుపుకుంటారు. తమిళనాడులో మకర సంక్రాంతిని 'పొంగల్‌ పండుగ' పేరుతో జరుపుకుంటారు. ఇక్కడ నాలుగు రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తారు. తొలి రోజు భోగి పొంగల్‌, రెండో రోజు సూర్య పొంగల్, మూడో రోజు మట్టు పొంగల్, నాలుగో రోజు కన్యా పంగల్ పేరిట సంబరాలు జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో 'జల్లికట్టు' పందేలను నిర్వహిస్తారు.

రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో మకర సంక్రాంతిని ఉత్తరాయన 'పతంగుల పండుగ'గా జరుపుకుంటారు. పెద్ద ఎత్తున గాలి పటాలను ఎగురవేస్తారు. పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో భోగి పండుగను 'లోహ్రి', మకర సంక్రాంతి 'మాఘి' పేరుతో జరుపుకుంటారు. ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మకర సంక్రాంతిని 'ఖిచిడీ' అని పిలుస్తారు. ఉద్దిపప్పు, బియ్యంతో చేసిన ఖిచిడీ, నువ్వుల లడ్డూలు, వేరుశనగలు, బెల్లంతో వంటకాలను ఇక్కడి ప్రజలు తయారు చేసుకుంటారు.

ఆ గ్రామాల్లో సంక్రాంతి నిషేధం

పంట చేతికొచ్చాక జరుపుకునే మొదటి పండుగ సంక్రాంతి. అందుకే ఇది తెలుగు ప్రజలకు అంత ప్రత్యేకం. అయితే పంట చేతికొచ్చినా అసలు ఈ పండగ ఊసే ఎత్తని గ్రామాలు ఉన్నాయి. సంక్రాంతికి పశువులను అలంకరించడం, వాటిని ఊరేగించడం లాంటివి అన్నమయ్య జిల్లాలోని టి.పసలవాండ్లపల్లె జీపీ పరిధిలోని 18 గ్రామాల్లో కనిపించవు. పైగా అవన్నీ ఇక్కడ నిషేధం కూడా. ఇది తరతరాలుగా పాటిస్తున్న ఆచారం. మార్చి నెలలో జరిగే పల్లావలమ్మ జాతరే ఇక్కడి ప్రజలకు సంక్రాంతి. గ్రామదేవత పల్లావలమ్మ ఆజ్ఞానుసారం అప్పట్లో ఈ పండుగను పూర్వీకులు నిషేధించినట్టు గ్రామస్తులు నమ్ముతారు. కాగా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే.. అమ్మవారి పేరు మీద కొందరు ఆవులను వదిలివేస్తారు. మార్చిలో అమ్మవారి జాతరకు వాటిని మాత్రమే సింగారించి ఆలయం వద్దకు తీసుకెళ్లి అక్కడ పూజించడం ఆనవాయితీ.

Next Story