అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా నదుల్లో ఇసుక తవ్వకాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో మరింతగా ఇసుక నిల్వలు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. 108 రేవుల్లో కూలీలతో మాన్యువల్‌గా తవ్వకాలకు ప్రభుత్వం పర్యావరణ అనుమతులూ తీసుకుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే జలాశయాలు, బ్యారేజీల్లో పూడికగా ఉన్న ఇసుకను తవ్వి ప్రభుత్వం విక్రయిస్తోన్న విషయం తెలిసిందే. వాటికి అదనంగా రీచ్‌ల్లో తవ్వి విక్రయించే ఇసుక జత కానుంది. చాలా మంది ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటుండటంతో ఇసుక సరఫరా చేస్తున్నందున వారం నిల్వలన్నీ ఒకేసారి బుక్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
నేటి నుంచి 50 శాతం నిల్వలు ఆన్‌లైన్‌లో బుకింగ్‌కు కేటాయించనున్నారు. మిగిలిన 50 శాతం ఇసుక ఆఫ్‌లైన్‌లో విక్రయించనున్నారు. అంటే నేరుగా రీచ్‌ల దగ్గరకు వెళ్లి ఆన్‌లైన్‌లో చెల్లించి ఇసుక తీసుకెళ్లొచ్చు. రీచ్‌ల వద్ద కేవలం సీనరేజ్ ఫీజు, ఇసుక తవ్వినందుకు అయిన ఖర్చు మాత్రమే తీసుకోనున్నారు. దీంతో నిల్వ కేంద్రాల్లోని ఇసుక ధర కంటే రీచ్‌ల వద్ద ఇసుక ధర మరింత తగ్గుముఖం పట్టనుంది. అటు గోదావరి, కృష్ణా, నాగావళి, వంశధార, పెన్నా, తుంగభద్ర తదితర నదుల్లో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం జిల్లాల వారీగా టెండర్లు నిర్వహించింది. అయితే గోదావరి, కృష్ణా నదుల్లో ఎగువ నుంచి నీరు వస్తుండటంతో.. ఆయా నదుల్లో తవ్వకాలకు మరికొన్ని రోజులు ఆగాల్సి వస్తోంది.