అమరావతి: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. వారికి ఈ నెల జీతాలు ఈ రోజే అందనున్నాయి. ఆ ఉద్యోగుల జీతాలు విడుదల చేసి ఒక రోజు ముందుగా స్లాట్ ఇవ్వడంతో నేడు (మంగళవారం) అకౌంట్లలో జమ కానున్నాయి. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీ రాజ్ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు అందుతున్నాయని, ఈ నెల ఒక రోజు ముందుగానే ఇస్తున్నట్టు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. సామాజిక పెన్షన్లు సైతం ఒక రోజు ముందుగా ఇవాళే పంపిణీ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో స్పాజ్ కేటగిరీని కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం చేర్చింది. పెన్షన్ పొందుతున్న వ్యక్తి చనిపోతే అతని భార్యకు ఈ కేటగిరీ కింద మరుసటి నెల నుంచి పెన్షన్ ఇవ్వనుంది. నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 15 వరకు గురించిన 5,402 మందికి నేడు పెన్షన్ అందనుంది. అలాగే వివిధ కారణాలతో 2 నుంచి 3 నెలలు పెన్షన్ తీసుకోని 50 వేల మందికీ నేడు మొత్తం పెన్షన్ ఇస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.