సీఎం జగన్, షర్మిల మధ్య భిన్నాభిప్రాయాలేగానీ... ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. షర్మిల తమ అందరి ఆత్మీయ సోదరి అని పేర్కొన్నారు. 2, 3 నెలలుగా షర్మిల పార్టీ ప్రయత్నాలు చేస్తున్నారన్న సజ్జల.. తెలంగాణలో వైసిపి వంటి పార్టీ ఉండాలని షర్మిల భావించి ఉండవవచ్చని అభిప్రాయపడ్డారు. జగన్ వైఎస్ఆర్ సిపి ఏర్పాటు చేసినప్పుడు రాజకీయ ఉద్దేశాలతో వ్యూహాలతో ఏర్పాటు చేయలేదని, వైఎస్ఆర్ మరణం తర్వాత ఏర్పడ్డ ఆ నాటి ప్రత్యేక పరిస్థితుల కారణంగా వైఎస్ఆర్సిపి రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది అని అన్నారు.
తర్వాత ఏర్పడిన పరిణామాలలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితం కావాలని జగన్ నిర్ణయించుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఆంధ్ర రాష్ట్రాభివృద్దిని ఆకాంక్షించే పార్టీగా ఉద్భవించి ప్రజల ఆకాంక్షలు నెరవెరుస్తుందని అన్నారు సజ్జల. అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారని, తమ పార్టీకి తెలంగాణలో కూడా రాజకీయ అవకాశం ఉందని, కానీ జగన్ నిర్ణయం కారణంగా అభిమానులు కోరినప్పటికీ వైఎస్ఆర్సిపి ఆంధ్రప్రదేశ్ కి పరిమితమైందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
రాజకీయాల్లో షర్మిలకు అనుభవం ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో సుదీర్ఘకాలం షర్మిల పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. పార్టీ నిర్ణయం, పర్యవసానాలు షర్మిల చూసుకుంటారని స్పష్టం చేశారు. షర్మిల నిర్ణయం పట్ల జగన్ కాస్త బాధపడి ఉండొచ్చని.. అయినా.. షర్మిలకు జగన్ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పారు.