ఆధారాలతో ఒక్క ఆరోపణ అయినా చేస్తున్నారా.? : సజ్జల
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన సవాల్ ను స్వీకరించడానికి తాము సిద్ధమేనని అంటున్నారు వైసీపీ నాయకులు.
By Medi Samrat Published on 19 Feb 2024 8:30 PM ISTటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన సవాల్ ను స్వీకరించడానికి తాము సిద్ధమేనని అంటున్నారు వైసీపీ నాయకులు. ఏపీ సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసరడంపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తన ఐదేళ్ల పాలనలో ఏం చేశారో చెప్పుకోలేని వ్యక్తికి, ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ ను సవాల్ చేసే అర్హత లేదన్నారు. గెలిచేది లేదని తెలిసి ఎన్ని చాలెంజ్ లు అయినా చేస్తారని ఎద్దేవా చేశారు. నీకు సత్తా ఉంటే 2014-19 మధ్య ఏం చేశావో చెప్పాలి. ఒక్క మాటైనా నిజం ఉందా... ఆయన గానీ, ఆయన కొడుకు గానీ, ఆయన అరువు తెచ్చుకున్న దత్తపుత్రుడు గానీ ఒక్క మాటైనా నిజం మాట్లాడతారా? అని ప్రశ్నించారు. ఇది చెత్త పాలన, నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటూ 2018లో దత్తపుత్రుడు పక్కకు వెళ్లిపోయాడని గుర్తు చేశారు సజ్జల. ఈ తండ్రీకొడుకులైనా 2014-19 మధ్య మేం ఇది చేశాం... జగన్ మోహన్ రెడ్డి పాలన కంటే మేం ఇందులో బాగా చేశాం.. మాకు ఓట్లేయండి అని ఒక్కరోజైనా అడుగుతున్నారా? అని ప్రశ్నించారు. ప్రజలే అంతిమనిర్ణేతలు.. ఈ కారుకూతలను ప్రజలు పట్టించుకోలేదన్నారు. తిట్లు తప్ప వాళ్లు వేరే అంశాలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? సహేతుకంగా, ఆధారాలతో ఒక్క ఆరోపణ అయినా చేస్తున్నారా అంటే అదీ లేదన్నారు సజ్జల. జగన్ ఎప్పుడెప్పుడో మాట్లాడినవన్నీ ఒక్కచోట చేర్చి పోస్టు పెట్టారు. అందులో జగన్ మాట్లాడినవేవీ మేం కాదనడంలేదు... కానీ తుది మేనిఫెస్టోలో ఏం చెప్పారన్నదే ముఖ్యం. అందులో మేం ఏమేం అమలు చేశామో రోజూ చెప్పుకుంటూనే ఉన్నామన్నారు. మద్య నిషేధం గురించి కూడా దశలవారీగానే అని అన్నాం. బెల్ట్ షాపులనేవే లేకుండా చేశాం. మద్యం షాపులు కూడా సగానికి సగం తగ్గిపోయాయి. ప్రభుత్వమే తీసుకోవడం వల్ల ఆదాయానికి గండిపడకుండా చూసుకుంటున్నామన్నారు సజ్జల.
ఒకప్పుడు మద్యం ఆదాయం రూ.16 వేల కోట్లు ఉండేది, ఇప్పుడది రూ.25 వేల కోట్లకు పెరిగింది. అదే సమయంలో మద్యపానం తగ్గింది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం వస్తోంది. ఇంతకుముందు సిండికేట్ రూపంలో దోచుకునేవాళ్లని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. మేనిఫెస్టోలో 99 శాతం పూర్తి చేశామని సగర్వంగా చెప్పుకుంటున్నాం. ఏవి మేం చేయలేకపోయామో చెప్పమన్నారు సజ్జల. మేం ఏం చేశామో ప్రజలకు చెబుతున్నాం. చంద్రబాబు ఎందుకు సభలు పెడుతున్నాడో తెలియదు. నీ అమరావతి రాజధాని రోడ్లు ఒక దగ్గర మొదలై, ఇంకో దగ్గర ముగుస్తాయి... నువ్వు కూడా అంతే. ఇప్పటికే కదలి రా, శంఖారావాలు అంటూ 20, 30 పేర్లు పెట్టుకుని బయల్దేరాడు. నాలుగు రోజులు ఈయన తిరుగుతాడు, నాలుగు రోజులు కొడుకు తిరుగుతాడు, ఇంకో రెండ్రోజులు దత్తపుత్రుడు తిరగబోయి మానేస్తాడన్నారు సజ్జల.