వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి నియామకం చెల్లబోదంటూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చిన తరుణంలో ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ జీవితకాల అధ్యక్షుడిగా జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికయ్యారని, ఆయనను శాశ్వత అధ్యక్షుడిగా చేయాలనే తీర్మానాన్ని సీఎం జగన్ పూర్తిగా తిరస్కరించారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం అన్నారు. తీర్మానాన్ని జగన్ తిరస్కరించినందున మినిట్స్‌లో ప్రస్తావించలేదని ఆయన స్పష్టం చేశారు.
ప్రతి ఐదేళ్లకోసారి అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాలని వైఎస్‌ఆర్‌సీపీ ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకుందని, అదే విషయాన్ని ఈసీకి తెలియజేశామని సజ్జల తెలిపారు. ఐదేళ్లకు ఒకసారి వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్ష ఎన్నికలను నిర్వహిస్తుందని మరోసారి వైఎస్సార్‌సీపీ ఎన్నికల సంఘానికి తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌పై జగన్ రెడ్డికి అపారమైన గౌరవం ఉందని సజ్జల ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి సీఎం జగన్ సత్కరించారని అన్నారు. ఎన్టీఆర్ పేరును చరిత్రలోంచి శాశ్వతంగా తుడిచివేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని విమర్శించారు. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదని కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీకీ శాశ్వత అధ్యక్షుడు గానీ, శాశ్వత పదవులు గానీ వర్తించబోవని ఈసీ తేల్చిచెప్పింది. ఈ క్రమంలోనే వైసీపీ నేత సజ్జల స్పందిస్తూ.. వైసీపీలో శాశ్వత అధ్యక్షుడు అనేదే లేదని స్పష్టం చేశారు.