చంద్రబాబు ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: సజ్జల

టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

By Srikanth Gundamalla  Published on  13 Oct 2023 10:15 AM GMT
Sajjala,  chandrababu, TDP, AP Govt,

చంద్రబాబు ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: సజ్జల

టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జైల్‌లో ఏసీ ఏర్పాటు చేయడానికి అదేమైనా చంద్రబాబు అత్తగారి ఇల్లా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. టీడీపీ నేతలు చంద్రబాబుకి అనారోగ్యంగా ఉందని ఆయన్ని బెయిల్‌పై విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి.. లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆయన బయట ఉన్నట్లు చెప్పారు. చౌతాలా ఇప్పటికీ జైల్‌లోనే ఉన్నారని.. గతంలో హర్యానాకు సీఎంగా పనిచేసిన చౌతాలకు కూడా వయసు 70ఏళ్లు పైనే ఉంటాయని సజ్జల చెప్పారు.

అయితే.. జైళ్లలో ఉండే ఇతర ఖైదీలకు కూడా అనారోగ్య సమస్యలు ఉంటాయని అన్నారు సజ్జల. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక్క చంద్రబాబుకి.. ఆయన కుటుంబ సభ్యులకే జైళ్లలో ప్రత్యేక హక్కులు కల్పించాలన్నట్లుగా దబాయిస్తున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్మవ్యాధిని ప్రాణాంతకంగా చూపిస్తున్నారని.. దయచేసి తప్పుడుగా ప్రచారం చేయొద్దని ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. చంద్రబాబు ఒక్కరే కాదు.. వేల సంఖ్యలో ఖైదీల జైల్లో ఉంటారు. ఏ విధంగా ఆయన ప్రత్యేకమైన వ్యక్తి? అని ప్రశ్నించారు. ఖైదీల్లో ఎవరైనా గ్రాడ్యయేట్లు ఉంటే వారికి సంబంధించిన ఏర్పాట్లు ఏవో ఉంటాయి అంటూ కౌంటర్‌ వేశారు. చంద్రబాబు కోసం ప్రత్యేకంగా ఏమీ ఉండవు.. మిగతా ఖైదీల్లానే చంద్రబాబుకి అన్ని వర్తిస్తాయని చెప్పారు. భద్రతపై ఆందోళన ఉంటే..అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశామని చెప్పుకొచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి.

చంద్రబాబుని ఎలాగైనా బయటకు తీసుకురావాలనే తాపత్రయంతోనే టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారని సజ్జల అన్నారు. ఆస్పత్రిలో చేర్చితే అయినా పైరవీలు చేయొచ్చని భావిస్తున్నారని చెప్పారు. రిమాండ్‌లో ఉండటం కూడా శిక్ష వంటిదే అని.. అది తప్పదని అన్నారు సజ్జల. చంద్రబాబు హుందాగా వ్యవహరిస్తే గౌరవం ఉంటుందని చెప్పారు. ఈ విషయం అందరూ గ్రహించాలని ఈ సందర్బంగా విన్నవించారు. అందరు ఖైదీల్లానే చంద్రబాబు ఉంటారు. ఆ దిశగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఏసీలు పెట్టాలని.. కారవాన్‌లు పంపాలి అంటూ కుదరదని చెప్పారు. తప్పు చేశారు కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Next Story