చంద్రబాబు చేసిన వ్యాఖ్యల ప్రభావం పదేళ్లయినా పోదు: సజ్జల
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న అంశం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 28 Sep 2024 12:54 PM GMTతిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న అంశం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై రాజకీయంగానూ విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. మాజీ సీఎం జగన్ ప్రభుత్వంలోనే ఇలాంటి ఘోరాలు జరిగాయంటూ.. కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. మరోవైపు వైసీపీ మాత్రం ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలే అని కొట్టి పారేసింది. తాజాగా ఇదే అంశంపై ఆ పార్టీనేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని సజ్జల అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే టీడీపీ కార్యాలయంలో ఎన్‌డీడీబీ రిపోర్టు లీక్ చేశారని సజ్జల విమర్శలు చేశారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో ఏమీ జరగకుండానే ఏదో జరిగినట్లు ఘోరమైన ఆరోపణలు చేశారని అన్నారు సజ్జల. అయితే ప్రభుత్వ ఆరోపణలను టీటీడీ మాజీ చైర్మన్లు ఖండించారని, దేనికైనా సిద్దమని చెప్పారని వ్యాఖ్యానించారు. అంతేగాక లడ్డూ వివాదంపై ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం చేయడానికి సిద్ధమయ్యారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారని అన్నారు. సోమవారం ఈ కేసు విచారణకు కూడా రానుందని సజ్జల. ఇక ఇప్పటికే ఇదే విషయాన్ని మాజీ సీఎం జగన్ కూడా రెండుసార్లు మీడియా సమావేశంలో చెప్పారని అన్నారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యల ప్రభావం మరో పదేళ్లు అయినా పోవని అన్నారు. ప్రజల్లో మళ్లీ విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత చంద్రబాబుపైనే ఉందని అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.