అమరావతి: అంగ వైకల్య నిర్ధారణ పరీక్షలకు సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభమైనట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు ప్రారంభం అవుతాయన్నారు. డిసెంబర్ వరకు ఇవి కొనసాగుతాయని చెప్పారు. మీ సేవ, గ్రామ, వార్డు సచివాలయాల్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
శారీరక వైకల్యం, మానసిక లోపాలు, కంటి చూపు వైకల్యం వంటి ఇతర లోపాలతో బాధపడే వారికి వైకల్యాన్ని నిర్ధారిస్తూ అందించేదే సదరం సర్టిఫికెట్. ఈ సర్టిఫికెట్‌ను ఆధారంగా చేసుకునే ప్రభుత్వం పింఛన్ ఇస్తుంది. ఈ సర్టిఫికెట్‌ను ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివిధ రకాల కొలమానాల ప్రకారం అందిస్తుంటారు. ఏదైనా ప్రమాదం జరిగి అవయవాలు కోల్పోయిన వారికి ఆర్థో, అంధత్వం, వినికిడి, మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం సదరం సర్టిఫికెట్ జారీ చేస్తుంది.
పింఛన్‌తో పాటు.. ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్, రాష్ట్ర, కేంద్ర రవాణా సంస్థలైన ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ప్రయాణ చార్జీల్లో రాయితీలు, చిన్న పరిశ్రమ స్థాపనకు రుణాలు, సబ్సిడీకి సదరం సర్టిఫికెట్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది.