Andhrapradesh: 'వారికి రూ.4 వేల పెన్షన్'.. మంత్రి సత్యకుమార్
ఆరు నెలల పాటు యాంటిరెట్రో వైరల్ థెరపీ కేంద్రాల ద్వారా చికిత్స పొందిన హెచ్‌ఐవీ బాధితులకు ప్రభుత్వం నెలకు రూ.4 వేల పెన్షన్ అందజేస్తుందని మంత్రి సత్యకుమార్ తెలిపారు.
By అంజి Published on 25 Jan 2025 7:14 AM ISTAndhrapradesh: 'వారికి రూ.4 వేల పెన్షన్'.. మంత్రి సత్యకుమార్
అమరావతి: ఆరు నెలల పాటు యాంటిరెట్రో వైరల్ థెరపీ కేంద్రాల ద్వారా చికిత్స పొందిన హెచ్‌ఐవీ బాధితులకు ప్రభుత్వం నెలకు రూ.4 వేల పెన్షన్ అందజేస్తుందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారంతో కొన్న ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింట్ అండ్ టెస్టింగ్ వాహనాలను మంత్రి ప్రారంభించారు. మారుమూల ప్రాంతాల్లో సేవలు అందించడం కోసం వీటిని అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. రాష్ట్రంలో 2.22 లక్షల మంది హెచ్‌ఐవీ బాధితులు ఉన్నారు.
విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(ఏపీఎస్ఏసీఎస్- ఏపీసాక్స్)' ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఎయిడ్స్ వ్యాధిపై సమగ్ర అవగాహన, పరీక్షల కోసం అందుబాటులోకి తెచ్చిన ఇంటెగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్(ఐసీటీసీ) మొబైల్ వ్యాన్ లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ''మానవ జాతికి ముప్పుగా మారిన మహమ్మారుల్లో ఎయిడ్స్ ఒకటి. ఈ వ్యాధిపై అవగాహన కల్పించడం, పరీక్షలు చేయడం, చికిత్స అవసరమైనవాళ్ళను ఏఆర్టీ కేంద్రాలకు పంపించడం మొబైల్ ఐసీటీసీ వాహనాల విధి. ఇప్పటికే రాష్ట్రంలో 1,600కు పైగా ఐసీటీసీలు ఉన్నాయి. వీటికి అదనంగా కేంద్రం సాయంతో.. రూ.3 కోట్ల 60 లక్షల నిధులతో మరో పది ఐసీటీసీలు అందుబాటులోకి తెచ్చాం. వీటిలో కౌన్సిలర్, ల్యాబ్ టెక్నీషియన్, అటెండెంట్స్ అంటారు. రూ. కోటీ 10 లక్షలు స్టాఫ్ కోసం ఖర్చు చేస్తున్నాం. మారుమూల, గిరిజన ప్రాంతాల వాళ్ళు, టెస్టుల కోసం ఆరోగ్య కేంద్రాలకు రాలేనివాళ్ళకు ఈ మొబైల్ ఐసీటీసీలు ఉపయోగపడతాయి'' అని పేర్కొన్నారు.
''ప్రస్తుతం రాష్ట్రంలో 2లక్షల 22వేల మంది హెచ్ఐవీ బాధితులున్నారు. వీరికి ఏఆర్టీ సెంటర్లలో చికిత్స అందిస్తున్నాం. ఉచితంగా యాంటీ రెట్రోవైలర్ డ్రగ్స్ ఇస్తున్నాం. ఏఆర్టీ సెంటర్లలో వరుసగా ఆరు నెలలపాటు చికిత్స తీసుకున్నవాళ్ళకు రూ.4వేల పెన్షన్ కూడా ప్రభుత్వం ఇస్తోంది. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెరగాలి. జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో భాగంగా మొబైల్ ఐసీటీసీల ద్వారా అవగాహన కల్పించడం, ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేసి వ్యాధిగ్రస్థులను గుర్తించడం చేస్తారు. చికిత్సకు లొంగని ఈ వ్యాధికి నివారణ ఒక్కటే మార్గం. ఐసీటీసీ వాహన సేవల్ని ప్రజలంతా ఉపయోగించుకోవాలి'' అని మంత్రి సూచించారు.