రూ.10 లక్షల ప్రమాద బీమా.. వీవోఏలకు శుభవార్త చెప్పిన మంత్రి కొండపల్లి
విజయవాడలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో సెర్ప్ (SERP) పరిధిలో పనిచేస్తున్న 28,500 మంది గ్రామ సంఘ సహాయకులకు...
By - అంజి |
రూ.10 లక్షల ప్రమాద బీమా.. వీవోఏలకు శుభవార్త చెప్పిన మంత్రి కొండపల్లి
విజయవాడలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో సెర్ప్ (SERP) పరిధిలో పనిచేస్తున్న 28,500 మంది గ్రామ సంఘ సహాయకులకు (వీవోఏలకు) మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేశారు. గ్రామ స్థాయిలో డిజిటల్ కమ్యూనికేషన్‌ను బలోపేతం చేయడానికి మరియు వీవోఏల సేవలను మరింత సులభతరం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. గతంలో 2016లో కూడా టీడీపీ ప్రభుత్వమే వీవోఏలకు ఫోన్లు అందించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెబుతూ, వీవోఏలకు రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నకిలీ సంఘాల పట్ల ప్రభుత్వం కఠినంగా ఉందని, ఇప్పటికే కొన్నింటిని గుర్తించి తొలగించినట్లు ఆయన స్పష్టం చేశారు. అలాగే, ఎంఎస్‌ఎంఈ (MSME) ద్వారా గ్రామాల్లో చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసే మహిళలకు పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు.
ఇదే సమావేశంలో మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ.. రాష్ట్ర హోం మంత్రి కంటే తనకే ఎక్కువ ప్రోటోకాల్ ఉంటుందని చమత్కరించారు. ప్రతి గ్రామంలోనూ ఉండే డ్వాక్రా మహిళలందరికీ తాను అతిథినని, ఏ ఇంట్లో అయినా భోజనం చేసే స్వేచ్ఛ తనకు ఉందని పేర్కొన్నారు. ప్రజల మెప్పు పొందాలన్నా, వారి ఆనందాన్ని చూడాలన్నా సెర్ప్‌లో పనిచేయడం ఒక గొప్ప అవకాశమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ సీఈవో వాకాటి కరుణ, స్త్రీనిధి ఎండీ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.