శస్త్రచికిత్స తర్వాత మొదటి సారి మాట్లాడిన రోజా..

Roja speaking for the first time after surgery.చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రోజా చికిత్స తీసుకుని ఇంటికి చేరుకున్నారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ, వైసీపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 April 2021 9:26 AM GMT
Roja

వైసీపీ ఎమ్మెల్యే రోజా సెల్వమణి ఇటీవల చెన్నైలో శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. ప్రస్తుతం ఆమె తన నివాసంలో రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రోజా చికిత్స తీసుకుని ఇంటికి చేరుకున్నారు. రెండు మేజర్‌ సర్జరీలు చేసుకొని చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన రోజా శనివారం డిశ్చార్జి అయ్యారు. గతేడాదే రోజాకు శస్త్రచికిత్స చేయాల్సి ఉండగా కరోనా తీవ్రత కారణంగా వాయిదా వేసుకున్నారు. జనరల్‌ చెకప్‌ కోసం మార్చి 24న ఆస్పత్రికి వెళ్లిన ఆమెకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు వెంటనే శస్త్ర చికిత్స చేయాలని సూచించగా.. ఆమెకు రెండు మేజర్‌ శస్త్రచికిత్సలు నిర్వహించారు. సర్జరీల తర్వాత 7 వారాల పాటు బెడ్‌‌రెస్ట్‌ తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆమె ఇంటికే పరిమితం అయ్యారు. ఆమె తాను క్షేమంగా ఉన్నానంటూ ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.

తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ, వైసీపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకంగా తనకు ఫోన్ చేసి ఆరోగ్య వివరాలు అడిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు అంటూ రోజా చెప్పుకొచ్చారు. తన ఆరోగ్య పరిస్థితి కారణంగా నెలరోజులు నడవకూడదని, అందుకే ప్రచారానికి రాలేకపోయానని అన్నారు. ప్రతి ఒక్కరూ వైసీపీ ఫ్యాన్ గుర్తుకే ఓటేసి జగనన్న పాలనకు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి ఏవిధంగా జగనన్నకు కానుక ఇచ్చారో, ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లోనూ అదే విధంగా వైసీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. ఇదే జగనన్నకు ఇచ్చే కానుక అని అన్నారు. ఏ నమ్మకంతో పరిషత్ ఎన్నికల్లో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి అయినా, జడ్పీటీసీ అభ్యర్థి అయినా జగనన్నే అని, జగనన్న పరిపాలనకు మద్దతుగా ఓటు వేస్తున్నట్టే భావించాలని అన్నారు.


Next Story