ఆంధ్రప్రదేశ్‌లో మునిసిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 2,214 డివిజన్, వార్డు స్థానాల్లో 580 ఏకగ్రీవం కాగా మిగతా వాటికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అలాగే, నాలుగు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 71 మునిసిపాలిటీలు, 12 నగర పాలక సంస్థల్లో పోలింగ్ జరుగుతోంది. బరిలో 7,549 మంది అభ్యర్థులు ఉండగా, 77,73,231 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పటమట లంకలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలోని పోలింగ్ బూత్ నంబరు 4లో పవన్ ఓటు వేశారు.

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓ సాధారణ వ్యక్తిలా క్యూ లైన్ లో నిలబడి ఓటు వేశారాయన. హిందూపురం చౌడేశ్వరి కాలనీలోని రెండవ వార్డు పోలింగ్ కేంద్రంలో బాలయ్య ఓటు వేశారు. విశాఖ 14వ వార్డులోని మారుతీనగర్ పోలింగ్ కేంద్రం-11లో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎంవీపీ కాలనీలోని 17వ వార్డులో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలు అందరూ ఓటు వేయాలని కోరారు. నగరి ఎమ్మెల్యే ఆర్‌కె.రోజా నగరిలో ఓటు హక్కును వినియోగిచుకున్నారు.

తర్వాత ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసిపిలో వెన్నుపోటు పొడిచే నాయకులున్నారని, వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు ప్రయత్నించారని, మళ్లీ ఇప్పుడు కార్పొరేషన్‌ ఎన్నికల్లో తమ అభ్యర్థులను ఓడించేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకు వెళ్తానని అన్నారు. ఇక నగరంలోని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు.


సామ్రాట్

Next Story