అమరావతి: తుపాన్ ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో రహదారులపై ఆంక్షలు విధించారు. జాతీయ రహదారుల్లో ప్రయాణించే భారీ వాహనాలను రాత్రి 7 గంటల నుంచి నిలుపుదల చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. ముందే సురక్షిత లేబేలో నిలుపుకోవాలని సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ స్పష్టం చేశారు.
అటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్ర తుపానగా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. గడిచిన గంటలో 15 కి.మీ వేగంతో కదిలిందని, ప్రస్తుతానికి మచిలీపట్నంకి 70 కిమీ, కాకినాడకి 150 కిమీ, విశాఖపట్నంకి 250 కిమీ దూరంలో కేంద్రీకృతం అయినట్లు చెప్పింది. తీరందాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. తుపాను దగ్గరకు వచ్చే కొద్ది తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరికలు జారీ చేసింది.